
చిల్లకల్లు (జగ్గయ్యపేట): ఎన్‌టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌ప్లాజాకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీ16 జడ్ 0599 బస్సు విజయవాడ నుంచి మియాపూర్ వెళ్తుండగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చే సరికి హెడ్‌లైట్లలో సమస్య తలెత్తడంతో అదుపు తప్పింది.
డ్రైవర్ నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పక్కకు దూసుకెళ్లి ఓ వైపునకు బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాపాడండంటూ కేకలు వేశారు.
గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడ్డ వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారిని మరో బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు.