రాష్ట్రంలో హోర్డింగ్‌లకెక్కిన లోకేశ్ ‘రెడ్ బుక్’ బెదిరింపులు
బ్లాక్‌మెయిల్‌తో అధికారులను లొంగదీసుకునే యత్నం
మరోవైపు రెచ్చిపోతున్న టీడీపీ, జనసేన శ్రేణులు
రాష్ట్రమంతటా కొనసాగుతున్న విధ్వంసం, ఆటవిక దాడులు
తమకు ఓటేయనివారు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యం
నూతన సీఎంను కలవడానికి వెళ్లిన అధికారులకు అవమానాలు.. పనితీరు మదింపు పేరిట అధికారులకు ‘రాజకీయ’ బ్రాండింగ్
వారంతా గతంలో బాబు హయాంలో పనిచేసిన వారే
గత ఐదేళ్లుగా కొందరి తీరు అన్యాయంగా ఉందంటూ నిందలు
కక్ష సాధింపులుండవంటూనే... కొందరు టార్గెట్‌గా చంద్రబాబు వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ పెద్దల వైఖరి
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై ఇటు ఆటవిక దాడులు కొనసాగిస్తూ అటు రాజ్యాంగాన్ని కాలరాసి నారా లోకేశ్ రాసుకున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలుకు రంగం సిద్ధమవుతోంది! రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌బుక్ హోర్డింగ్‌ల ఏర్పాటుతో తాము మరింతగా కొనసాగించనున్న విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను టీడీపీ నిర్భీతిగా చాటింపు వేస్తోంది.
రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ ఆ కుట్రకు సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా తెర తీయడం విస్తుగొలుపుతోంది. ఐఏఎస్ అధికారులే లక్ష్యంగా బ్లాక్ మెయిలింగ్, వేధింపులకు ఆయన శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసే అధికారులను పనితీరు మదింపు నివేదికల పేరుతో లొంగదీసుకోవడం, అనంతరం తమ అక్రమాలకు వారిని సాధనంగా చేసుకోవడమే లక్ష్యంగా ఈ కుట్రకు అంకురార్పణ చేశారు.
రాష్ట్రంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న విపరిణామాలు, అక్రమాలు, బీభత్సకాండకు అధికార యంత్రాంగంతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలి చ్చారు. ఒకవైపు తమకు ఓటేయనివారు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తూ మరోవైపు అధికార యంత్రాంగాన్ని సొంత అజెండా అమలుకు వాడుకునేందుకు సన్నద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
అటు వ్యాజ్యాలు.. ఇటు వార్నింగ్‌లు
రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మంత్రి నారా లోకేశే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్ ఫోటోలతో రెడ్‌బుక్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి టీడీపీ సర్కారు భయోత్పాతం సృష్టిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ నాయకుడి ఫొటోలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. టీడీపీ మాత్రం ‘రెడ్ బుక్’ పేరుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం వారి హింసాత్మక ప్రవృత్తిని బట్టబయలు చేస్తోంది.
మంగళగిరి, విజయవాడ, గుంటూరుతోపాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఈ హోర్డింగులు వెలిశాయి. ఎన్నికలకు ముందే ‘రెడ్‌బుక్’ పేరుతో అధికారులపై లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. నిబంధనల మేరకు వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అందరి పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంగతి తేలుస్తానని, అంతు చూస్తానని హెచ్చరించారు.
అఖిల భారత స ర్విసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదని అప్పట్లోనే రాజకీయ పరిశీలకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ టీడీపీ తన కుట్రలకు పదును పెడుతోంది.
పచ్చముఠాల విధ్వంసకాండ
బీజేపీతో పొత్తును ఆసరాగా చేసుకుని టీడీపీ రౌడీమూకలు ఎన్నికలకు ముందే విధ్వంసకాండకు తెరతీశాయి. సమర్థంగా పని చేస్తున్న పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్(ఈసీ) ద్వారా బదిలీ చేయించి మరీ గూండాగిరీకి పాల్పడ్డాయి. పోలింగ్ ముందు రోజు, అనంతరం దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టి విరుచుకుపడ్డాయి. బాంబు దాడులకు దిగాయి.
ఎన్నికల్లో విజయం సాధించాక టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు.
టీడీపీ గూండాల విధ్వంసకాండతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గ్రామాలను విడిచి వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఎన్నికల విధుల కోసం వచ్చిన కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రంలో ఉండగానే పరిస్థితిలా ఉంటే.. తర్వాత ప్రభుత్వ పెద్దలు ఎలా వ్యవహరించనున్నారో స్పష్టమవుతోంది.
వేధించే పన్నాగం
అఖిలభారత సర్విసు అధికారులపై రాజకీయ ముద్ర వేసి వేధించాలని ఎన్నికల ముందే రూపొందించిన కుట్ర అమలుకు సన్నద్ధం కావడం ప్రభుత్వ పెద్దల దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని చెప్పుకుంటూ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు అఖిలభారత సర్విసు అధికారుల విధి విధానాల గురించి పూర్తిగా తెలుసు. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు మారుతుంటాయి గానీ రాష్ట్రానికి కేటాయించిన అఖిల భారత సర్విసు అధికారులు కొనసాగుతుంటారు.
వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటూ మంచి పరిపాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. అందుకు విరుద్ధంగా చంద్రబాబు రాజకీయ కక్షతోనే కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడేందుకు సిద్ధమవుతుండటం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన కొందరు అధికారులను కలవకుండా వెనక్కి పంపారు. కొందరు అధికారులు ఇచ్చిన పూల బొకేలను సైతం తీసుకునేందుకు తిరస్కరించారు.
ఇక తనను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినట్టుగా లేవని పరిశీలకులంటున్నారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు అన్యాయంగా ఉందని సీఎం నిందలు వేశారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం లేదంటూనే తన అక్కసునంతా వెళ్లగక్కి వ్యక్తిగత అజెండాను బయటపెట్టారు. కక్ష సాధింపులుండవంటూనే కొందరు అధికారులు టార్గెట్‌గా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు.
సమాచార సేకరణలో బాబు బృందం
అఖిల భారత సర్విసు అధికారులను వేధించే కుట్రకు చంద్రబాబు తెరతీశారు. తమవారు ఎవరు? పరాయి వారు ఎవరు? అనే సమాచారం సేకరించాలని తన బృందాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్రస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు సమాచారాన్ని సేకరించే పనిలో చంద్రబాబు బృందం నిమగ్నమైంది. ఆ విషయాన్ని టీడీపీ వర్గాలు బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి. తద్వారా అధికారులను బ్లాక్‌మెయిల్ చేయాలన్నది అసలు ఉద్దేశం.
నిబంధనలకు విరుద్ధంగా తాము పురమాయించే పనులు చేసేలా లొంగదీసుకునే కుట్రతో ఈ తతంగాన్ని సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఐదేళ్లూ తాము ఏం చెబితే అదే చేయాలి! నిబంధనలు ఉటంకిస్తూ అభ్యంతరాలు చెప్పకూడదు! అనే సందేశాన్ని దీని ద్వారా ఇవ్వనున్నారు. అందుకు సమ్మతించే అధికారులకే పోస్టింగులిస్తామని, లేదంటే వేధిస్తామని చెబుతుండటం చంద్రబాబు కుట్రను బట్టబయలు చేస్తోంది.
ఇదేనా పెద్దరికం?
ప్రభుత్వ పెద్దననే విషయాన్ని మరచిపోయి సీఎం చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో లోకేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి ఆ శాఖ అధిపతిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ ఆయన నిబంధనల మేరకే విధులు నిర్వర్తించారు. అయితే చంద్రబాబు రాజకీయ కారణాలతో సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవాస్తవ ఆరోపణలు చేశారు. ఆయన్ను బదిలీ చేయాలని ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేపోవడంతో ఈసీ ఆయన్ను బదిలీ చేయలేదు. ఎన్నికల ముందు సామాజిక పెన్షన్ల పంపిణీలోనూ ఈసీ ఆదేశాలనే ఆయన పాటించారు.
అయినా సరే చంద్రబాబు ఆయనపై చిందులు తొక్కారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాక సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లిపోవాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ నెలాఖరున జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి జవహర్‌రెడ్డి విధుల్లో ఉండకూడదని చంద్రబాబు పట్టుబట్టి మరీ వేధించడం గమనార్హం.
బాబు పేషీ అధికారులకూ జగన్ కీలక పోస్టింగ్‌లు
2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జగన్ తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పోస్టింగులిచ్చారు. చంద్రబాబు పేషీలో పనిచేసిన సాయిప్రసాద్‌ను కీలకమైన సీసీఎల్‌ఏగా నియమించారు.
ఆయన పేషీలో పనిచేసిన అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు–భవనాలు, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతలు అప్పగించారు. టీడీపీ హయాంలో ఆర్థిక శాఖలో పనిచేసిన అధికారులనే జగన్ తన ప్రభుత్వ హయాంలోనూ కొనసాగించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేతిలో చేతిలో కాగితాన్ని బలవంతంగా లాక్కున్న ఐఏఎస్ అధికారికి కూడా కీలకమైన పోస్టింగ్ ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు.
జగన్ ఓడాడు.. ఇంకా చావలేదు!
అయ్యన్న విద్వేష వ్యాఖ్యలు
‘‘జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదు’’ అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వాడు ఓడిపోయాడు కానీ చావలా..! అపారమైన ధన బలం ఉంది.. కుల బలం ఉంది.. పక్కన తెలంగాణ ప్రభుత్వంలో వీడి మనుషులు ఉన్నారు’ అని ఓ వ్యక్తి అందులో అయ్యన్నతో వ్యాఖ్యానించాడు.
దీనిపై అయ్యన్న ప్రతిస్పందిస్తూ.. ‘చచ్చేదాక కొట్టాల! ఈయన చెప్పింది కరెక్టే. ఓడిపోయాడు కానీ చావలేదు. చాలా మంచి డైలాగ్ ఇది’ అని పేర్కొన్నారు. ఓడిపోయాడు కానీ చావలేదనే డైలాగ్ తనకు బాగా నచ్చిందంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. పామును చచ్చేవరకు కొట్టాలనే డైలాగ్‌ను తాను బయట మాట్లాడేటప్పుడు వాడతానంటూ తన నైజాన్ని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment