
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్‌కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్‌పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్‌నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్‌కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు.
పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్‌పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు.
యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్‌పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్‌బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్‌ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్‌ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment