బాలినేనికి స్వాగతం పలికేందుకు వచ్చిన కార్ల ర్యాలీ (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న బాలినేని
ఒంగోలు: సీఎం జగన్ మాటే తమకు శాసనమని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు అడుగడుగునా భారీ ర్యాలీలతో స్వాగతం పలికారు. అనంతరం తన నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రిగా ఉన్నప్పటి కంటే మంత్రి పదవికి రాజీనామా చేశాక వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు నాపై ఎక్కువ అభిమానాన్ని చాటారు. పెద్దఎత్తున వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాను’ అని చెప్పారు.
ఈనెల 22న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మహిళలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. తొలుత మార్టూరు మండలం బొప్పూడి వద్ద ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని అనంతరం ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. బొప్పూడి వద్ద ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకటరాంబాబు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు, బొల్లాపల్లి టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఏపీ శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment