
లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ పోల భాస్కర్
ఒంగోలు అర్బన్: జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన ఈ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచుతామని, వీటిపై అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధిం«చి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేశ్ తెలిపారు. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment