విమానాశ్రయం(గన్నవరం)/ఏఎన్‌యూ:విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి బుధవారం పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. 170 మందితో కూడిన హజ్ యాత్రికుల తొలి బృందం ప్రత్యేక విమానంలో జెడ్డాకు బయలుదేరింది. అంతకుముందు గుంటూరు జిల్లా నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో యాత్రికులు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం.. హజ్ యాత్ర విమానాన్ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజమ్, ఇతర మత పెద్దలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందన్నారు. గతంలో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారన్నారు. దీనివల్ల యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు పంపించేందుకు చర్యలు తీసుకుందన్నారు. దీని వల్ల యాత్రికులపై రూ.83 వేల చొప్పున అదనపు భారం పడుతుండటంతో.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం జగన్ వెంటనే స్పందించి వారిపై భారం పడకుండా రూ.14.51 కోట్లు విడుదల చేశారని చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఈసారి మొత్తం 1,814 మంది హజ్ యాత్రకు వెళ్లిరానున్నారని వివరించారు. ఏపీతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హజ్ యాత్రికులను అంజాద్ బాషా కోరారు. తాము ఇబ్బంది పడకుండా అదనపు భారం భరించడంతో పాటు అన్ని హంగులతో ప్రభుత్వం వసతి కేంద్రం ఏర్పాటు చేసిందని యాత్రికులు చెప్పారు. తమకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, యాత్రికులకు డిప్యూటీ సీఎం, హజ్ కమిటీ చైర్మన్ తదితరులు డ్రై ఫ్రూట్స్, గొడుగులు అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జఖియా ఖానం, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు రహుల్లా, ఇషాక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సలహాదారు హబీబుల్లా, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్‌పోర్ట్ భద్రతాధికారి వెంకటరత్నం, డీఎస్పీ జయసూర్య, హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ బాసిత్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment