ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ప్రారంభమైంది. దాంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణ ఉత్సవం 29వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భవానీ మాలధారులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే భవానీల రాక ప్రారంభమైంది. దీక్ష విరమణ నేపథ్యంలో దేవదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థాన ఘాట్ రోడ్డు, రాజగోపురానికి రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటల తర్వాతే దర్శనం
శనివారం తెల్లవారుజామున దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. హోమగుండాల్లో ఉదయం 8.23 గంటలకు అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ, అర్చకులు పాల్గొన్నారు. అగ్నిప్రతిష్టాపన అనంతరం ఇరుముడుల సమర్పణ ప్రారంభమైంది.
నగరానికి భవానీలు
శనివారం దీక్ష విరమణ ఉత్సవం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే భవానీలు విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఉదయం తమిళనాడుకు చెందిన భవానీలు, పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా దీక్ష విరమణకు ముందు రోజు తమిళనాడు నుంచి పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తుంటారు.
గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు
నగరానికి శుక్రవారం చేరుకున్న భవానీలు దుర్గాఘాట్, కనకదుర్గనగర్‌లో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరి ప్రదక్షణ ప్రారంభించారు. గిరి ప్రదక్షణ మార్గాల్లో భవానీలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భవానీలు గిరి ప్రదక్షణ చేసే కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది.
వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు
గిరి ప్రదక్షణ పూర్తి చేసిన భవానీలు వినాయకుడి గుడి వద్దకు చేరుకుని క్యూలైన్ ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. వినాయకుడి గుడి వద్ద క్యూలైన్‌లోకి చేరిన భవానీలు, భక్తులు అమ్మవారి దర్శనం అనంతరమే బయటకు చేరుకుంటారు. కొండపై మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గంతో పాటు మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇరుముడులను సమర్పించాల్సి ఉంటుంది. ఇరుముడులను సమర్పించిన అనంతరం నేతి కొబ్బరికాయలను హోమగుండాలలో సమర్పించి, అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో ఏర్పాట్లు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీ దీక్ష విరమణ సందర్భంగా గట్టు వెనుక ప్రాంతంలోని భవానీ, పున్నమి ఘాట్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీల వాహనాలను (బస్సులు, కార్లు, టెంపోలు) పార్కింగ్ చేసుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ పక్కనగల ఖాళీ ప్రదేశాన్ని నిర్ణయించారు. అక్కడే తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఏర్పాటు చేశారు. అనంతరం స్నానాలు చేసేందుకు రెండు ఘాట్లల్లో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, మరుగుదొడ్లను సిద్ధం చేశారు. భవానీలు తలనీలాలను సమర్పించిన అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పున్నమి హోటల్ వద్ద నుంచి బస్సులను ఏర్పాటు చేసింది.
మాస్కు తప్పనిసరి
దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు శుక్రవారం మీడి యాతో మాట్లాడారు. భవానీలు, భక్తులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించి, కోవిడ్ నిబంధలను పాటించాలన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో ఇరుముడులను సమర్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు, భవానీలకు దద్దోజనం, పులిహోర ప్యాకెట్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ దీక్ష విరమణలకు ఐదు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనావేశామన్నారు. రోజుకు ఆరు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాన్నారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో భవానీలకు జల్లు స్నానా లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, ఈఈ భాస్కర్, పాలక మండలి సభ్యులు కటకం శ్రీదేవి, గంటా ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment