
కాకినాడ సిటీ: దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తీకరణ్ జాతీయ స్థాయి పురస్కారాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ ఎన్‌వీవీ సత్యనారాయణ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదివారం వర్చువల్‌గా అందుకున్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ జెడ్పీగా గుర్తించి ఈ అవార్డు అందజేశారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో మన జిల్లా దేశంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. ప్రతి నెల, మూడు నెలలకోసారి జెడ్పీ సమావేశం నిర్వహించి, 13 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
తద్వారా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడంతో ఈ అవార్డు దక్కింది. జిల్లాలో సాగు, తాగు అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించడం.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యా విధానం అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించి, రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి ఉత్తీర్ణత సాధించడం.. ఆరోగ్య సేవలపై కేంద్రీకరణ.. జిల్లా ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయడం.. 108 కాల్ సెంటర్ల ఏర్పాటు ద్వారా సేవలు.. స్త్రీ, శిశు శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం.. జెడ్పీ పరిధిలోని వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వివిధ సంక్షేమ పథకాలను సకాలంలో అందించడం.. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, దాని నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలు చేపట్టడం.. గ్రామీణ రహదారులను పట్టణ రోడ్లతో అనుసంధానం చేయడం.. గ్రామాల్లో మెరుగైన వీధి లైట్ల నిర్వహణ.. ఉపాధి హామీ పనులకు సకాలంలో బిల్లుల చెల్లింపు తదితర కార్యక్రమాలపై జిల్లా పరిషత్ దృష్టి పెట్టింది. తద్వారా జెడ్పీ ఈ అవార్డు దక్కించుకుంది. రాష్ట్రంలోనే జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ఒకే ఒక్క జెడ్పీ మనది కావడంపై చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment