ఎస్‌ఆర్‌సీ నివేదికను సవాల్‌ చేసుకోండి | Challenge the SRC report | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌సీ నివేదికను సవాల్‌ చేసుకోండి

Published Fri, Aug 2 2024 5:10 AM | Last Updated on Fri, Aug 2 2024 5:10 AM

Challenge the SRC report

మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ

తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా

సాక్షి, అమరావతి: ప్రాణహాని లేదంటూ సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) ఇచ్చిన నివేదికను సవా­ల్‌ చేసుకోవాలని మాజీ అదనపు అడ్వొకేట్‌ జన­రల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఆర్‌సీ నివేదికను సుధాకర్‌రెడ్డికి అందజేయాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి వి­చారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అప్పటి వర­కు ఆయనకు భద్రతను కొనసాగించాలని ప్రభుత్వా­న్ని ఆదేశించింది. అయితే ఇందుకు అయ్యే వ్య­యా­న్ని సుధాకర్‌రెడ్డే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశా­రు. గత ప్రభుత్వ హయాంలో కేసు­లు వాదించానన్న కక్షతో తనకున్న భద్ర­తను ఉపసంహరించాలని ప్రభు­త్వం నిర్ణయించిందని, అందువల్ల ఈ వ్య­వహారంలో జోక్యం చేసుకుని, తన భద్రతను కొన­సా­గించేలా ఆదేశాలు ఇవ్వా­లని కోరు­తూ పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

రాంసింగ్‌ వ్యాజ్యంపై విచారణ వాయిదా
12న తుది విచారణ జరుపుతామన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అలాగే ఫిర్యాదుదారు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మెమో రూపంలో కోర్టు ముందుంచేందుకు రాంసింగ్‌కు అనుమతినిచ్చింది. 

ఈ మేరకు న్యాయ­మూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ అప్పటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌ తనను బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌ ఫిర్యాదు అనంతరం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్య­లన్నింటినీ నిలిపేస్తూ 2022 ఫిబ్రవరి 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా గురువారం రాంసింగ్‌ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఆయన తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను మెమో రూపంలో కోర్టు ముందుంచుతామన్నారు. 

ఈ సమయంలో ఫిర్యాదుదారు ఉదయ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులోలాగే మరో వ్యక్తిని కూడా రాంసింగ్‌ బెదిరిస్తే కోర్టు రాంసింగ్‌పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిందన్నారు. ఆ కేసును కొట్టేయాలని రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందన్నారు. అదే రీతిలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా కొట్టేయాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement