
సాక్షి, అమరావతి: టీడీపీ తలపెట్టిన ప్రజా యాత్రలు ఆ పార్టీలో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకైనా ఏదో ఒక యాత్ర చేపట్టాలని చంద్రబాబు చాలా రోజులుగా తలపోస్తున్నారు. అయితే యాత్ర ఏదైనా సరే.. తాను చేస్తానని ఆయన కుమారుడు లోకేష్ పట్టుబడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక దశలో పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ ప్రయత్నించారు.
తండ్రికి బదులు తానే జిల్లాల్లో పర్యటనలు, పరామర్శలు, సమీక్షలు నిర్వహించారు. చంద్రబాబు బస్సు యాత్ర దాదాపుగా ఖరారైంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేలా యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాను కూడా సైకిల్ యాత్ర నిర్వహిస్తానని లోకేశ్ పేర్కొనగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది. కాగా లోకేష్ యాత్రల పట్ల పార్టీ సీనియర్లలో విముఖత వ్యక్తమవుతోంది. దీనివల్ల పార్టీకి లాభం చేకూరకపోగా నష్టం వాటిల్లుతుందని చర్చించుకుంటున్నారు.