‘షెల్‌’ మింగిన ‘స్కిల్‌’  | Chandrababu Looted Public funds through shell companies | Sakshi
Sakshi News home page

‘షెల్‌’ మింగిన ‘స్కిల్‌’ 

Published Sun, Sep 10 2023 5:24 AM | Last Updated on Sun, Sep 10 2023 10:54 AM

Chandrababu Looted Public funds through shell companies - Sakshi

అడ్డుగోలుగా ప్రజాధనం కొల్లగొట్టేందుకు వీలుగా సీమెన్స్‌ కంపెనీ ముసుగులో చంద్రబాబు రూపొందించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ – డిజైన్‌ టెక్‌ ఒప్పందం

సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సీమె­న్స్‌ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు.

ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌ కంపెనీ తన 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా చెల్లించకపో­యినా 10 శాతం ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేలా చంద్రబాబే ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికా­రులు వారించి ఏకంగా నోట్‌ ఫైళ్లలోనే అభ్యంతరం తెలిపినా బేఖాతర్‌ చేస్తూ షెల్‌ కంపెనీలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

అనంతరం ఆ నిధులు వివిధ షెల్‌ కంపెనీల ద్వారా హైదరాబాద్‌­లోని చంద్రబాబు బంగ్లాకే చేరిపోయాయి. ఈ మొత్తం అవినీతి బాగోతంలో చంద్రబాబు సర్వం తానై వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ, నిప్పులా బతికానంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబు అవినీతి వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకు­న్నారు. డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన సంజయ్‌ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్‌ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు.

భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ కన్విల్కర్‌ సహ­కారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్‌ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీతో సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు.

రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి..
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాల ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. బాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూ పొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చు కున్నట్టు  2015 జూన్‌ 30న ఉత్తర్వులిచ్చారు. 

అంతా బాబు ముఠానే..
ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు.  ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా  సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ – ఇన్నోవేటివ్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.

తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్‌ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌ భాస్కర్‌ సతీమణి, యూపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అపర్ణను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 

నో రూల్స్‌... ‘ఏఐ’.. రూ.371 కోట్లు ఇచ్చేయండి
ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక  కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్‌ తన నోట్‌ ఫైల్‌లో పొందుపరిచారు.

సీమెన్స్, డిజైన్‌టెక్‌ కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లు ఎందుకు చెల్లించాలని సునీత లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ముందు ఏదో ఒక జిల్లాలో పైలట్‌గా అమలుచేసి తరువాత నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్‌ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్‌ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్‌ చేశారు.  నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు.

అదే విషయాన్ని పీవీ రమేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 

షెల్‌ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు 
డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 

దర్యాప్తు చేపట్టిన ఈడీ..
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతా­ల్లోకి మళ్లించాక సింగపూర్‌కు ఎలా వెళ్లాయి..? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయనే విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది.

చంద్ర­బాబు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయ­మున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఇప్పటికే సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ), వికాస్‌ ఖన్విల్కర్‌ (డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌(చార్టెడ్‌ అకౌంటెంట్‌)లను అరెస్టు చేసింది.

కడిగిపారేసిన కాగ్‌
రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌( కాగ్‌) కూడా బాబు హయాంలో స్కిల్‌ డెవల­ప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని పేర్కొంది. వాస్తవ  లెక్కల ప్రకారం ప్రాజెక్ట్‌ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లే విడుదల చేయాలి.

అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి  ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొ­ట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ తెలిపింది.  

నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం
టీడీపీ హయాంలోనే 2018లో ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 

చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌ ఇదీ..
► గత ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. 
► డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. 
► పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్‌ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...
ఏసీఐ: రూ.56 కోట్లు
నాలెడ్జ్‌ పోడియమ్‌: రూ.45.28 కోట్లు
ఈటా: రూ.14.1 కోట్లు
పాట్రిక్స్‌: రూ.3.13 కోట్లు
ఐటీ స్మిత్‌: రూ.3.13 కోట్లు
భారతీయ గ్లోబల్‌: రూ.3.13 కోట్లు
ఇన్‌వెబ్‌: రూ.1.56 కోట్లు
పోలారీస్‌: రూ.2.2 కోట్లు
కాడెన్స్‌ పార్టనర్స్‌: రూ.12 కోట్లు
► మొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. 
► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. 
► ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 

ఉప్పందించిన పుణె సామాజిక కార్యకర్త
2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది.

ఆ వెంటనే సీమెన్స్‌ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్‌ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్‌ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్‌ టెక్, ఇతర షెల్‌ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్‌ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు.

నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్‌ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్‌ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు  వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్‌ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది.

ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో లేనప్పటికీ అందుకే తుది చార్జ్‌షీట్‌లో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సిట్‌ కేసును పకడ్బందీగా నమోదు చేసింది. చంద్రబాబుతోసహా ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్‌ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement