Updates:
►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం
►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్
►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది
►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా
►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం
►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది
►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు.
►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు
►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్‌మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.
సహకార డెయిరీలకు పాతరేసిన బాబు
రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది.
లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు
సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా..
సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్‌బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు.
ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు?
ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది.
ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment