మొన్న ముచ్చుమర్రిలో వాసంతి..
నేడు పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక కిడ్నాపైన మూడు రోజులకూ రక్షించలేని పోలీసులు
హంతకులెవరో కూడా కనిపెట్టలేకపోయారు
బాలిక శరీరంపై గాయాలు, రక్తస్రావం గుర్తించిన స్థానికులు
గాయాలేమీ లేవని పోస్టుమార్టంలో తేలిందంటున్న పోలీసులు
ప్రభుత్వ అసమర్థతపై ముస్లిం సంఘాలు, ప్రజాసంఘాల మండిపాటు
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.
బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం.
ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు?
అంజుమ్ కిడ్నాప్‌నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు.
బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్‌మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు.
ఎన్‌ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా
పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి.
హంతకులను వెంటనే పట్టుకొని ఎన్‌కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.
వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం
బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు.
చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment