CM Jagan Released Input Subsidy To Farmers Affected By Natural Disasters - Sakshi
Sakshi News home page

రైతులు నష్టపోకూడదని ప్రభుత్వ ధ్యేయం: సీఎం జగన్‌

Published Tue, Nov 16 2021 11:34 AM | Last Updated on Tue, Nov 16 2021 1:42 PM

CM Jagan Released Input Subsidy To Farmers Affected By Natural Disasters - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు రూ.22 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు.

రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రైతు ఇబ్బందిపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీద పడుతుందని సీఎం తెలిపారు.  ఇది తెలిసి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేయలేదని, రైతును చేయిపట్టి నడిపించే విధంగా ఎవరూ చేయలేదన్నారు. ఇవాళ తాము తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండాలని మనసా, వాచా, కర్మేణా ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామని సీఎం తెలిపారు. 

చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్‌

తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్‌ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతుకు మళ్లీ పెట్టుబడి అందేలా చేస్తున్నామని, ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారాన్ని చెల్లించే కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకు రావడం జరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో వారికి పరిహారం చెల్లిస్తున్నామని, నష్టపోయిన ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు.

రైతు పక్షపాత ప్రభుత్వం
2 నెలల క్రితం గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా రూ.22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. రూ.22 కోట్లే కదా అని కొందరు గిట్టవాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుందని, కాని ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగా కచ్చితంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి తోడుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సీఎం జగన్‌ అన్నారు. ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర ఏళ్ల కాలంలో నవంబర్‌లో నివర్‌ తుపాన్‌ వచ్చిందని అ‍న్నారు.

డిసెంబర్‌ చివరినాటికి 8.34 లక్షల మందికి 645.99 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చామని సీఎం జగన్‌ చెప్పారు. ఎక్కువ, తక్కువ మొత్తం అనేది కాకుండా రైతుకు నష్టం జరిగినా, తుపాను వచ్చినా ఇతరత్రా కష్టం వచ్చినా ప్రభుత్వం రైతుకు తోడుంగా ఉంటుందనే గట్టి సందేశం ఇవ్వాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,071 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. రెండున్నరేళ్ల కాలంలో రైతులకోసం అనేక చర్యలు తీసుకున్నామని, వైఎస్సార్‌ రైతు భరోసా కింద అక్షరాల రూ.18,777 కోట్లు నేరుగా రైతుల చేతికి అందించామని చెప్పారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్లు ఇచ్చామని, ఉచిత పంటల బీమా కింద 3,788 కోట్లు ఇచ్చామని, పగటి పూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. 

ఆక్వా రైతులకు రూ.1505 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ ఇచ్చామని ఫీడర్ల కోసం రూ.1700 కోట్లకుపైగా ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పనిచేస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం మాత్రమే 2 సంవత్సరాల కాలంలో అక్షరాల రూ.30వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం రూ.1800 కోట్లు వెచ్చించామని, ఇతర పంటల కొనుగోలు కోసం రైతు నష్టపోకుండా రూ.6430 కోట్ల ఖర్చు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల నిధి
రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం అన్నారు. ధాన్యం సేకరణకోసం గత ప్రభుత్వం పెట్టిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించామని, ఉచిత విద్యుత్‌ కింద రూ.9వేల కోట్ల కరెంటు బకాయిలను గత ప్రభుత్వం పెడితే దాన్ని చెల్లించామని తెలిపారు. విత్తన బకాయిలు కూడా కట్టామని, రైతన్నలకు తోడుగా ఉండాలని వ్యవస్థలోకి  మార్పులను తీసుకు వస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 

వ్యవసాయ సలహా కమిటీలు ఆర్బీకేల స్థాయి, మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పెట్టామని చెప్పారు. ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడ్డాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది.. రబీ సీజన్‌ ముగియకముందే వారికి పరిహారాన్ని చెల్లిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement