2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డులు | CM Jagan review on Awards for village and ward volunteers | Sakshi
Sakshi News home page

2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డులు

Published Thu, Mar 11 2021 3:13 AM | Last Updated on Thu, Mar 11 2021 8:11 AM

CM Jagan review on Awards for village and ward volunteers - Sakshi

క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో ఉగాది రోజు నుంచి వారిని గౌరవించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా ఇంకా ఏమి చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించే కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు ఇచ్చే ప్రసంశా పత్రం, మెడల్, బ్యాడ్జి, శాలువాలను  ఆయన పరిశీలించారు. సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు.

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా, వచ్చే నెల 13వ తేదీన ఉగాది పండుగ రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సత్కార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్షి్మ, గ్రామ, వార్డు సచివాలయాలు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
లెవల్‌–1  
2,18,115 మంది వలంటీర్లకు ‘సేవా మిత్ర’ 
ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన 2,18,115 మంది గ్రామ, వార్డు వలంటీర్లను సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.10 వేలు నగదు, సర్టిఫికెట్‌ (ప్రసంశా పత్రం), శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు. 
 
లెవల్‌–2  
4000 మంది వలంటీర్లకు ‘సేవా రత్న’ 
ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా మండలానికి ఐదుగురు చొప్పున 659 మండలాల్లో 3,295 మంది, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున 109 మున్సిపాలిటీల్లో 545 మంది, కార్పొరేషన్లలో పది మంది చొప్పున 16 కార్పొరేషన్లలో 160 మంది మొత్తంగా 4,000 మంది వలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. 
 
లెవల్‌–3  

875 మంది వలంటీర్లకు ‘సేవా వజ్ర’ 
ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement