మంచి చేస్తుంటే.. గుడులపై దాడులా? | CM YS Jagan Comments About Attacks On Temples And Destruction Of Idols | Sakshi
Sakshi News home page

మంచి చేస్తుంటే.. గుడులపై దాడులా?

Published Tue, Jan 5 2021 3:03 AM | Last Updated on Tue, Jan 5 2021 8:10 AM

CM YS Jagan Comments About Attacks On Temples And Destruction Of Idols - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదంటూ.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం రాకూడదనే దుర్బుద్దితోనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని చెప్పారు. సమాజంలో వైట్‌ కాలర్‌ నేరాలు పెరిగిపోయాయని, కలియుగంలో క్లైమాక్స్‌ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. దేవుడంటే భయం, భక్తి లేని పరిస్థితికి దిగజారారన్నారు.

తప్పు ఎవరు చేసినా తప్పేనని, అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని, పార్టీలు, కులమతాలు చూడొద్దని పోలీసులకు సీఎం స్పష్టం చేశారు. దేవదాయ శాఖ పరిధిలో లేని చిన్న ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల పర్యవేక్షణలో ఉన్న గుడులలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఈ రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని అడ్డుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో కొత్తగా 20 వేలకు పైగా ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానం కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా జరుగుతున్న ఏపీ పోలీస్‌ తొలి డ్యూటీ మీట్‌ను సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా  రాష్ట్రంలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న ఘటనలపై తీవ్రంగా స్పందించారు. 
వర్చువల్‌ విధానంలో పోలీస్‌ మీట్‌ను ప్రారంభించి అభినందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వీళ్లసలు మనుషులేనా...?
‘‘వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు  మారిపోతున్నాయి. రాజకీయాల కోసం ఈరోజు దేవుడిని సైతం వదిలిపెట్టడం లేదు. మారుమూల ప్రదేశాల్లో, జనసంచారం తక్కువగా ఉన్నచోట అందరూ నిద్రించే సమయంలో అర్థరాత్రి పూట ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మరుసటి రోజు సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లలో వీటిని ప్రచారం చేస్తారు. అసలు ఇటువంటి వారు మనుషులేనా అనిపిస్తోంది. ఇటువంటి తప్పులను ఊరికే వదిలేయవద్దని చెప్పాం. న్యాయం, ధర్మం అనే రెండే రెండు అంశాలు పరిగణలోకి తీసుకుని అడుగులు ముందుకు వేయాలని ఆదేశాలిచ్చాం. ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు చెడ్డపేరు తేవాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. 

మంచి చెడు రెండూ ఉంటాయి..
ఏ సమాజం తీసుకున్నా..  ఏ కాలం తీసుకున్నా.. ఏ మత విశ్వాసాలను గమనించినా రెండు శక్తులు కనిపిస్తాయి. ఒకటి ఎప్పుడూ చెడు చేస్తూ... చెడుమీద ఆధారపడే శక్తులు కొన్ని కనిపిస్తాయి. ఆ చెడును అడ్డుకుంటూ... మంచిని కాపాడే శక్తులు మరోవైపు కనిపిస్తాయి. టీడీపీ హయాంలో.. మనవాళ్లు ఏం చేసినా చూసీచూడనట్లు పోవాలని నిర్మొహమాటంగా, ఏమాత్రం జంకు లేకుండా గత సర్కారు డైరెక్ట్‌గా ఆదేశాలు ఇచ్చింది. అన్యాయం అనేది ఎవరు చేసినా ఉపేక్షించవద్దని, పార్టీలు, రాజకీయాలు, కులమతాలు చూడాల్సిన అవసరం లేదని, మావాళ్లు చేసినా తప్పు తప్పేనని నేను మొట్టమొదటిసారి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లోనే స్పష్టంగా చెప్పా.

18 నెలల పాలన భయం పుట్టించిందేమో..
ఈరోజు రాజకీయాలు ఎలా మారిపోయాయో ఆలోచిస్తే చాలా బాధనిపిస్తోంది. బహుశా ఈ పద్దెనిమిది నెలల మన పరిపాలన వారిలో ఆ భయాన్ని పుట్టించిందేమో. కులం, మతం, పార్టీలు, ప్రాంతం భేదాలు చూడకుండా అర్హత ఒక్కటే ప్రాతిపదికగా తీసుకున్నాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చి మనకు ఓటు వేయని వారికి అర్హత ఉంటే ప్రతి సంక్షేమ పథకం అందాలని నిర్దేశించాం. వివక్షకు తావు లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే... ప్రతిపక్షం తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లడాన్ని గమనిస్తున్నాం. ప్రజలకు ఇంత మంచి చేస్తున్న పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి’’

దృష్టి మళ్లించేందుకే దిగజారుడు రాజకీయాలు
ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంటే చూసి తట్టుకోలేక ఏ రకంగాను దానికి ప్రచారం రాకూడదని, అందరి దృష్టి మళ్లించేందుకు గుడులు, గోపురాలను ధ్వంసం చేసేందుకు సైతం వెనుకాడటంలేదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు వీళ్లు ఎలాంటి మనుషులు? ఎందుకింత దిగజారుడు? అని బాధ అనిపిస్తోంది. దీనికి సంబంధించి తొమ్మిది ఘటనల గురించి చెబుతా. కులమతాల మద్య చిచ్చు పెట్టే ఈ కార్యక్రమాలను చూస్తుంటే పోలీస్‌శాఖ ఎలాంటి నేరాలను డీల్‌ చేయాల్సి వస్తుందనేందుకు వీటిని ఒక ఉదాహరణగా చెబుతున్నా.
తిరుపతిలో జరుగుతున్న పోలీస్‌ మీట్‌ కార్యక్రమాలను వర్చువల్‌ విధానంలో వీక్షిస్తున్న సీఎం 

► 2019 నవంబర్‌ 14న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు, సదుపాయాలను అందించేందుకు ఒంగోలులో మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించాం. పేద పిల్లల కోసం చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకూడదని, పబ్లిసిటీ రాకూడదని గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే అది పచ్చి అబద్దం. రోడ్డుకు అడ్డంగా గుడి ఉందని, వేరే చోట ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ట చేసిన తరువాతే ఇక్కడ రోడ్లు విస్తరణ చేశారు. కానీ అదే రోజు సోషల్‌ మీడియాలో గుడి కూల్చారని రచ్చ చేశారు.

► 2020 జనవరి 21న పిఠాపురం ఆంజనేయస్వామి గుడిలో 23 విగ్రహాలు ధ్వంసం అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దానికి వారం ముందు అంటే జనవరి 15న దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి పబ్లిసిటీ రాకూడదని విగ్రహాల ధ్వంసం  కార్యక్రమం చేశారు.

► 2020 ఫిబ్రవరి 11న రొంపిచర్లలో వేణుగోపాలస్వామి విగ్రహాలు ధ్వంసం.  13.2.2020న ఉండ్రాజవరం మండలం సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం. 14.2.2020న నెల్లూరు జిల్లాలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి  ఆలయ రథం దగ్థం. 8.2.2020న ఆడపిల్లల రక్షణ కోసం రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించాం. దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు, గోపురాల ధ్వంసం కార్యక్రమం చేశారు. మహిళా లోకం అంతా దిశా చట్టం, దిశా పోలీస్‌ స్టేషన్‌లు తమకు ఎంతో ఉపయోగడతాయని చెబుతుంటే ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతోందని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందుకోసం వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి, అమ్మవారి ముఖద్వారం ధ్వంసం, నెల్లూరులో ఒక రథం కాలిపోయింది. ఒక దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తే మూడు ఘటనలు జరిగాయి. 

► 2020 సెప్టెంబర్‌ 7న 55,607 అంగన్‌వాడీల్లో 31.16 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చేందుకు తల్లీబిడ్డ వికాసం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని తెచ్చాం. దానికి ఒక్క రోజు ముందు అంటే.. సెప్టెంబర్‌ 6న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దగ్ధం చేశారు. 

► 2020 సెప్టెంబర్‌ 11న 87 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సుమారు రూ.6,700 కోట్లు నేరుగా వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళల ముఖాల్లో తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడనే ఆనందం కనిపిస్తూ ఉంటే.. దానికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే 13.9.2020న విజయవాడ దుర్గగుడి రథం వెండి సింహాలను మాయం చేశారు.

► రైతన్నల పొలాలకు జలసిరి అందించేందుకు, బోరు వేయించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ జలకళ కార్యక్రమాన్ని గత సెప్టెంబర్‌ 28న మొదలు పెట్టాం. దానికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే 25వతేదీన నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

7 గతేడాది అక్టోబర్‌ 8న విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించి విద్యార్ధులకు అండగా ఉన్నామనే భరోసా ఇవ్వడానికి సిద్ధమయ్యాం. దీనికి సరిగ్గా మూడు రోజుల నుంచి ధ్వంస రచన ప్రారంభమైంది. అక్టోబర్‌ 5న కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి శేష పడగలు ధ్వంసం చేశారు.

► బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని వెనుకబడిన కులాలకు మంచి చేసే కార్యక్రమానికి గత అక్టోబర్‌ 16న శ్రీకారం చుట్టాం. అదే సందర్భంలో అక్టోబర్‌ 17న కార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి గోపురం ధ్వంసం అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. 

► దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలో పేద అక్కచెల్లెమ్మల పేర్లతో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే... తిరుపతి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం లైటింగ్‌ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ లేకపోయినా... శిలువ ఉంది అంటూ ప్రచారం చేశారు. విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు జగన్‌ వస్తున్నాడని తెలిసి అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాముల వారి విగ్రహంపై దాడి చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు గ్రామాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయని రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి గుడిపై దాడికి పాల్పడ్డారు.  

‘‘రాష్ట్రంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? దేవాలయాలపై దాడులు చేస్తే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాలు దెబ్బతీసేలా విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దుర్మార్గాలు చేస్తున్నారు? ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఎత్తున మంచి పనులు చేసినప్పుడల్లా ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వారిని ఉపేక్షించకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇటువంటి వాటిని తిప్పికొట్టాలి’’  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement