మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయం | CM YS Jagan Comments In Maulana Abul Kalam Azad Jayanti | Sakshi
Sakshi News home page

మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయం

Published Thu, Nov 12 2020 2:22 AM | Last Updated on Thu, Nov 12 2020 8:58 AM

CM YS Jagan Comments In Maulana Abul Kalam Azad Jayanti - Sakshi

భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులరి్పస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

నంద్యాల ఘటన బాధాకరం. ఆ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు రాగానే, న్యాయబద్ధంగా ఏం చేయాలో అది చేశాం. తన, మన, పర అని చూడకుండా పోలీసులపై కేసులు పెట్టి, అరెస్టు చేశాం. అయితే గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్, ఆ పార్టీకి చెందిన రామచంద్రరావు అనే వ్యక్తి ఆ ఇద్దరు పోలీసులకు వెంటనే బెయిల్‌ ఇప్పించాడు. అంటే వారే బెయిల్‌ పిటిషన్‌ వేస్తారు. మళ్లీ వారే ప్రభుత్వాన్ని నిందిస్తారు. వారి పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు. ఆ బెయిల్‌ను క్యాన్సిల్‌ చేయడం కోసం సెషన్స్‌ కోర్టుకు వెళ్లాం.
  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముల భావనను మరింతగా పెంపొందించేందుకు అన్ని ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. 17 నెలల పాలన కాలంలో మైనారిటీలకు రూ.3,428 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, పెన్షన్‌ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు రూ.2,585 కోట్లు నేరుగా నగదు బదిలీ చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా మైనారిటీలకు అందే ప్రయోజనం రూ.843 కోట్లు అని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

విద్యా రంగంలో సంస్కరణలకు ఆద్యుడు
► నేడు (బుధవారం) ఆజాద్‌ జయంతి. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, బహు భాషా ప్రవీణుడు. దేశ తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఎన్నో సేవలు అందించారు. అందుకే ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 
► 2008లో ప్రియతమ నాయకుడు వైఎస్సార్‌ నిర్ణయం ప్రకారం ఆజాద్‌ జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
► మన విద్యా వ్యవస్థ దేశ అవసరాలకు తగినట్లు మార్చేందుకు ఆజాద్‌ ఎంతో కృషి చేశారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు పలు సంస్కరణలు అమలు చేశారు. విద్యా శాఖలో భాగమైన బోర్డులు, సంస్థలు, కమిషన్లు, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ప్రారంభించింది ఆయనే. 
ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు 

తల్లిదండ్రుల్లా బాధ్యతగా నిర్ణయాలు
► రాష్ట్రంలో మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’తో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. 
► చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పిల్లలకు దుస్తులు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌ బుక్స్, బ్యాగ్స్‌ మొదలగునవి ఇస్తున్నాం. తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్‌ వాటర్, కాంపౌండ్‌ వాల్‌ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. 
► మధ్యాహ్న భోజనం మెనూ మార్చాం. మంచి కరిక్యులమ్, ఇంగ్లిష్‌ మీడియమ్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులూ ఇస్తూ అండగా నిలుస్తున్నాం. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగా ఆలోచించి బాధ్యతగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.   
వివిధ మతాల పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
   
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో..
► ఇవాళ మైనారిటీల మీద జూమ్‌లో, ట్విటర్‌లో ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్న ఒకాయన, గతంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో మైనారిటీలకు అందించింది రూ.2,661 కోట్లు మాత్రమే. 
► 2014–15లో రూ.345 కోట్లు, 2015–16లో రూ.340 కోట్లు, 2016–17లో రూ.641 కోట్లు, 2017–18లో రూ.667 కోట్లు, 2018–19లో రూ.668 కోట్లు ఇచ్చారు. 
► ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపిన మహానుభావుడు. ఎన్నికల ముందు వరకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మైనారిటీల మీద తనకు ప్రేమ ఉందంటాడు. ఎలా బురద చల్లాలన్నదే వారి లక్ష్యం. 
   
అవి కూడా అమలు చేస్తాం 
► మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఇంకా రెండు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయి. వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు పెంచడం, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం.  
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు.

మైనారిటీల కోసం ఎన్నెన్నో చేశాం..
► ఇవాళ మైనారిటీ సోదరుల కోసం నిజాయితీగా అన్నీ చేస్తున్నాం. హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్‌కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచాం.
► రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, రూ.3 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజాన్‌లకు రూ.3 వేల గౌరవ వేతనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌరవ పూర్వకంగా అందిస్తున్నాం. దీన్ని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజాన్‌లకు రూ.5 వేలకు పెంచుతూ జనవరి 1న ఆదేశాలు జారీ చేశాం.
► వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. క్రైస్తవులు, మిషనరీల ఆస్తులు కాపాడేందుకు కూడా రీ సర్వే చేపడుతున్నాం.
► నవరత్నాల ద్వారా మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ముస్లింలు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement