CM YS Jagan Discussion On Agriculture Allied Sectors In AP Assembly - Sakshi
Sakshi News home page

రూ.6,903 కోట్లతో పంటల కొనుగోలు

Published Thu, Sep 22 2022 4:28 AM | Last Updated on Thu, Sep 22 2022 9:20 AM

CM YS Jagan discussion on agriculture allied sectors AP Assembly - Sakshi

విద్యుత్‌ మోటార్ల విషయంలో టీడీపీ, చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నాయి. మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఏ ఒక్క రైతు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసే ప్రసక్తే లేదు. మీటర్ల వల్ల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు. నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి రైతుకు అందించగలుగుతాం. ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ సరిపోతుందా.. లేదా.. తెలుసుకుని మార్పులు చేసుకోవచ్చు.  డిస్కంలను ప్రశ్నించే హక్కు రైతులకు వస్తుంది.  
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వంలో రైతులు నష్టపోకుండా వారు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ రూ.6,903 కోట్లతో 20.10 లక్షల టన్నుల పంటలు కొనుగోలు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కష్టపడి పండించిన పంటకు ధర పడిపోతే.. రైతులు ఎంతగా నష్టపోతారో తెలిసిన ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అండగా నిలిచామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన బుధవారం ఆయన వ్యవసాయం–అనుబంధ రంగాలపై స్వల్ప కాలిక చర్చలో మాట్లాడారు.

ఆర్బీకే స్థాయిలో సీఎం యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌) తీసుకొచ్చి, దీని ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. పంటల వారీగా మద్దతు ధరల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. రేటు పడిపోయినప్పుడు రైతులు ఆర్బీకే దృష్టికి తీసుకొస్తే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌.. జేసీలను అప్రమత్తం చేసి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ధాన్యానికి సంబంధించి ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.14 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

చనిపోయిన రైతుల కుటుంబాలకు భరోసా
► గత ప్రభుత్వంలో వరుస కరువుల ప్రభావం, బాబు హామీలు నమ్మి అప్పు కట్టకుండా వడ్డీలు, చక్రవడ్డీలు పెరగడం, ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్య చేసుక్ను రైతన్న కుటుంబాలను గతంలో ఎన్నడూ లేని విధంగా మానవతా దృక్పథంతో అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం. ఇందుకోసం ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి పెట్టాం. గత ప్రభుత్వం తరహాలో కాకుండా రైతు ఆత్మహత్యలు కచ్చితంగా నమోదయ్యేలా చూస్తున్నాం. కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తున్నాం.
► చంద్రబాబు హయాంలో 473 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతో వారిని పట్టించుకోలేదు. ఆ కుటుంబాలకు కూడా మనం వచ్చాక రూ.5 లక్షల చొప్పున రూ.23.65 కోట్లు ఇచ్చాం. 
► 2019 జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 308 రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున రూ.21.56 కోట్లు ఇచ్చాం. 2020లో 260 రైతు కుటుంబాలకు రూ.18.20 కోట్లు ఇచ్చాం. 2021లో రైతు ఆత్మహత్యలు తగ్గాయి. ఆ ఏడాది 126 మంది చనిపోతే, వారి కుటుంబాలకు రూ.8.82 కోట్లు ఇచ్చాం. ఇలా ఇప్పటి వరకు రూ.72.14 కోట్లు పరిహారంగా ఇచ్చాం. 2021–22లో రూ.20 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.15.34 కోట్లు పరిహారంగా ఇచ్చాం. 

కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచాం 
► కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల నుంచి రుణాలు అందించడం కోసం 2019లో పంటల సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్‌ఏ)తీసుకొచ్చాం. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రైతులతో సమానంగా పథకాలు, రుణాలు అందేలా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందిస్తున్నాం.  
► వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. ఇందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్లు, సబ్‌ స్టేషన్‌లను అప్‌గ్రేడ్‌ చేశాం. ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ 18.70 లక్షల పంపుసెట్లకు ఉచితంగా పగటి పూట విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మూడేళ్లలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్‌ బకాయిలు రూ.9 వేల కోట్లు చెల్లించాం. ఆక్వా రైతులకు కరెంట్‌ సబ్సిడీ కింద రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

రైతులను నిలువునా మోసగించిన బాబు
► 2014 ఎన్నికలకు ముందు బేషరుతుగా రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. తీరా గద్దెనెక్కాక రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. బాబు హామీని నమ్మిన రైతుల అప్పులకు వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగి, సున్నా వడ్డీ పథకం ఎగిరిపోయి.. మరో రూ.87 వేల కోట్ల మేర నష్టానికి గురయ్యారు. బాబు ఎలా మోసం చేశారో ఈ వీడియో ద్వారా చూద్దాం. (వీడియో ప్రదర్శించారు) 
► 2014 ఎన్నికల ముందు ‘రైతులు తీసుకున్న అన్ని రుణాలను పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది’ అని చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ‘రుణమాఫీ ఇచ్చేశాం. అంతా మాఫీ చేస్తానని నీకు ఎవరు చెప్పారు? ’ అంటూ మాట మార్చారు. రుణ మాఫీ ఒక్కటే కాదు. సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇలా అన్నింటికి సున్నా చుట్టిన ఘనత ఈ పెద్దమనిషి చంద్రబాబుదే. 
► మనందరి ప్రభుత్వం వచ్చాక విప్లవాత్మక చర్యలతో రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. 
  
వ్యవసాయ రంగంలో మనం అమలు చేస్తున్న ప్రతి పథకం 87 శాతం 
రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలన, నాణ్యమైన ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. పంటల కొనుగోలు, యంత్ర పరికరాలు, పాల సేకరణ ధర పెంపు, పశువుల కోసం అంబులెన్స్‌లు, ఉచిత బోర్లు.. ఇలా పలు విధాలా అన్నదాతలకు అండగా నిలిచాం.

ఇవి కాకుండా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు.. ఇళ్లు, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర నవరత్నాలూ అందజేయడం ద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఊతమిచ్చాం. అయితే ఇవన్నీ చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాత్రం కనిపించడం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement