Andhra Pradesh: YSRCP announces list of 18 candidates for MLC polls - Sakshi
Sakshi News home page

YSRCP MLC Candidates: మరో బీసీ విప్లవం..

Published Tue, Feb 21 2023 2:18 AM | Last Updated on Tue, Feb 21 2023 3:31 PM

CM YS Jagan Finalized YSRCP MLC Candidates In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: శాసన మండలిలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 14 మందిని అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలను నాలుగు ఓసీ సామాజిక వర్గాలకు కేటాయించారు.

పట్టభద్రులు, టీచర్ల విభాగం ఎన్నికలను మినహా­యిస్తే శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 7 స్థానాలకు ఎన్నికలతో పాటు గవర్నర్‌ కోటాలో రెండు స్థానాలను ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీఎం జగన్‌ ఆవిష్కరించిన సామాజిక మహా­విప్లవంలో దీన్ని మేలి మలుపుగా సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు. 

44కు పెరగనున్న అధికార పార్టీ బలం..
తాజాగా నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వరకు శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 31 ఉంది. వీరిలో పదవీ కాలం ముగుస్తున్న ఐదుగురు సభ్యులను మినహాయిస్తే 26 మంది ఉంటారు. అందులో బీసీలు 8, ఎస్సీలు 4, మైనార్టీలు నలుగురు కాగా ఓసీలు పది మంది ఉన్నారు. స్థానిక సంస్థల్లోనూ, శాసనసభలోనూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేని బలం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 16తోపాటు గవర్నర్‌ కోటాలో రెండు కలిపి మొత్తం 18 స్థానాలు వైఎస్సార్‌సీపీకే దక్కుతాయి. అప్పుడు మండలిలో అధికార పార్టీ బలం 44కు చేరుతుంది. అందులో బీసీలు 19, ఎస్సీలు 6, ఎస్టీ ఒకరు, మైనార్టీలు నలుగురు ఉంటారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సభ్యుల 

సంఖ్య 30 (68.18 శాతం)కి చేరుకుంటుంది. ఓసీ సభ్యుల సంఖ్య 14 (31.82 శాతం) అవుతుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం సీఎం వైఎస్‌ జగన్‌ స్థాయిలో రాజ్యాధికారంలో ఆయా వర్గాలకు వాటా ఇచ్చిన దాఖలాలు లేవని ప్రశంసిస్తున్నారు.

టీడీపీ హయాంలో 2014–19 మధ్య శాసనమండలిలో ఆ పార్టీకి 48 మంది సభ్యులు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 మంది (37.5%)కి మాత్రమే చంద్రబాబు అవకాశం కల్పించారని గుర్తు చేస్తున్నారు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడగా సీఎం జగన్‌ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులు వేస్తున్నారని సామాజిక వేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

తొలి అడుగే బలంగా..
2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సొంతం చేసుకుంది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌ జూన్‌ 8న ఏర్పాటైన మంత్రివర్గం నుంచే 

సామాజిక న్యాయ సాధన కోసం తొలి అడుగే బలంగా వేసి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రెవెన్యూ, జలవనరులు, మున్సిపల్, విద్య తదితర కీలక శాఖలు అప్పగించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా కల్పించారు. 

► దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. 

► ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించగా అందులో నలుగురికి (80 శాతం) బడుగు, బలహీన వర్గాల నుంచే అవకాశం కల్పించారు.

► శాసనసభ స్పీకర్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. 

సామాజిక మహావిప్లవానికి నాంది..
► 2022 ఏప్రిల్‌ 11న పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించి సామాజిక మహావిప్లవానికి నాంది పలికారు. 

► టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్‌ రాజ్యసభకు పంపి చిత్తశుద్ధి చాటుకున్నారు. 

► రాజ్యాధికారం, పరిపాలనలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేయడం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్‌ చాటిచె ప్పారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.

‘స్థానిక’ సాధికారత..
► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఉత్తర్వులు జారీ చేస్తే చంద్రబాబు వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతలతో హైకోర్టులో కేసులు వేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. అయితే టీడీపీ కుట్రలు చేసిన రిజర్వేషన్లను తగ్గించినా పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు.

► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు.

► 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ ఛైర్మన్‌ పదవులు (69 శాతం) ఇచ్చారు.

► 14 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్‌ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొంటే 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. 

► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగగా 84 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు (69 శాతం) ఇచ్చారు.

చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవులు..
నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్‌ పదవులు ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. 

► 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులకు నియామకాలు చేపట్టగా బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి  117 పదవులు (60 శాతం) ఇచ్చారు.

► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులు ఉండగా 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 

► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులు ఉంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్‌ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు.

‘సాధికార’ బాటలో..
గత 44 నెలలుగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,92,958.90 కోట్లను డీబీటీతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఖాతాల్లోకే రూ.1,43,178.78 కోట్లు (74.20 శాతం) జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద చేకూర్చిన ప్రయోజనాలు వీటికి అదనం. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు, ఆర్థిక సాధికారతకు బాటలు వేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన, నాడు–నేడు ద్వారా ఆధునికకీరణ, అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ విద్యా సాధికారతకు కృషి చేస్తున్నారు. మహిళలకు వైఎస్సార్‌ చేయూత, ఆసరా ద్వారా ఆర్థికంగానూ, పదవుల్లో దాదాపు సగ భాగం వాటా ఇవ్వడం ద్వారా మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నారు.

ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారత ద్వారా ఆయా వర్గాలు సంపూర్ణ సామాజిక సాధికారత సాధించే దిశగా అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్‌ నిబద్ధతతో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement