చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!  | CM YS Jagan Govt spent Rs 54 thousand crores for education sector | Sakshi
Sakshi News home page

చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం! 

Published Mon, May 1 2023 4:27 AM | Last Updated on Mon, May 1 2023 9:25 AM

CM YS Jagan Govt spent Rs 54 thousand crores for education sector - Sakshi

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి.  కానీ... 

రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్‌ కథనాలు.

జూనియర్‌ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్‌ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్‌ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్‌ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? 

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమా­రయ్యేది. ఇంటర్‌ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు.

రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్‌ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్‌ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్‌ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!.  

ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్‌ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్‌లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు.  


ఫలితాన్నిచ్చిన పథకాలు... 
ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్‌ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... 

జీఈఆర్‌ పెంచిన అమ్మ ఒడి
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్‌ జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్‌. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్‌ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది.
 
నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’
పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్‌లో ఒక స్కూల్‌ బ్యాగ్, స్టిచింగ్‌ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు  ఇంగ్లీష్‌– తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది.

స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్‌తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? 

అది.. ఆడపిల్లల గౌరవం
సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్‌ ఉద్దేశం.

అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్‌ వాటర్‌ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్‌ నిర్వహణ నిధిని (ఎస్‌ఎంఎఫ్‌) ఏర్పాటు చేశారు.  

ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం
ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్‌ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్‌. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది.

ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్‌ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.

ఇప్పటికే 1,000 పాఠశాలల్లో  సీబీఎస్‌ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్‌ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్‌సైడ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ (ఆర్‌ఎల్‌సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్‌తో కలిసి టీచర్లు స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్‌ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. 

వినూత్నంగా డిజిటల్‌ తరగతులు... 
పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో  ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్‌ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన  15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్‌ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్‌ తరగతులతో పిల్లలకు  నాణ్యమైన ఈ–కంటెంట్‌... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌ ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది.  

మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు
ప్రభుత్వం  2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది.

సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. 

మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే
తెలుగు­దేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్‌ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుండాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

ఇందులో ఒకటి హైస్కూల్‌ను అప్‌గ్రేడ్‌ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్‌లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్‌ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు.

మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్‌2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్‌ జూనియర్‌ కాలేజీలనూ బాలికల జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్‌ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలే­దంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. 

విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు..
ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్‌ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 

కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... 
చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్‌ అయ్యేవారు.

చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థిను­లకు సరైన సదుపాయాలు లేవు.

ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యా­కానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్‌తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. 

పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’
‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్‌. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి.

మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి.  

హాజరు పెంచిన ‘గోరుముద్ద’
ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్‌ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అం­దించేలా చేశారు.

వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్‌లను అందించాలని కూడా  ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. 

డిజిటల్‌ లెర్నింగ్‌... కొత్త చరిత్ర
కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ పీఎఎల్, బైజూస్‌ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్‌ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు.

2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు  ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్‌ లెర్నింగ్‌కు పనికొస్తాయి.

తరవాత ఇంటర్మీడియెట్‌ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్‌ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్‌ వంటి ఎడ్యుటెక్‌ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement