విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ‘హై టీ’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌కు కేక్ అందిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజేలు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని.. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆకాంక్షించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించటం సంతోషంగా ఉందని సీజేఐ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘హై టీ’ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన తరఫున, తన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1965 తర్వాత ఏపీ నుంచి తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం ఇదే తొలిసారన్నారు. ఇది తెలుగు జాతికి అత్యంత గర్వకారణమని, సీఎంగా తనకు ఎంతో సంతోషదాయకమన్నారు. సీజేఐ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాల, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తదితరులు
సీజేఐకు సీఎం సాదర స్వాగతం
అంతకుముందు.. జస్టిస్ ఎన్. వెంకట రమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. సీజేఐ సతీమణి శివమాల, సీఎం సతీమణి వైఎస్ భారతి, ఇతర ప్రముఖుల్లో కొందరు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంగణంలోకి జస్టిస్ ఎన్వీ రమణను సాదరంగా తోడ్కొని వచ్చిన సీఎం.. అక్కడ తన మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను సీజేఐకు పరిచయం చేశారు. అలాగే జడ్జిలు, ఇతర న్యాయాధికారులను ఇరువురూ పలకరించారు. అనంతరం.. జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులను కూడా సీఎం సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని, కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాలకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వైఎస్ భారతి
జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను శనివారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానంతరం శనివారం ఉదయం వెంకటరమణ దంపతులు నోవోటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, జుడీషియల్ సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చారు. ముందుగా డిప్యూటి సీఎం నారాయణస్వామి ఎన్వీ రమణను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంగీత కళాకారులు అన్నవరపు రామస్వామి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కావూరి సాంబశివరావు,అచ్చెన్నాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment