CM YS Jagan Meeting with YSRCP Leaders at Tadepalli - Sakshi
Sakshi News home page

CM YS Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన

Published Thu, Dec 8 2022 3:55 PM | Last Updated on Thu, Dec 8 2022 7:24 PM

CM YS Jagan Meeting with YSRCP Leaders at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే ...:
పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్‌ కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచాం

రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్నదానిపై ఒక ప్రణాళికను మీకు వివరిస్తాం

క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు రీజినల్‌ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నాం

గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ వెళ్తున్నారు. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారు.

ఓ వైపు గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలి. దీనికోసం 10-15 రోజుల్లో 1.66  కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించింది.

దీనికోసం 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్‌ చేస్తున్నాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ– గృహసారథులుగా ఉంటారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు వీళ్లు చూస్తారు. 

అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారు. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపికచేయాలి. 

మొత్తంగా యాభైఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో  5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారు. 

ముందుగా చేయాల్సిన పని రాష్ట్రంలోని దాదాపు 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు వీరిని ఎంపిక చేస్తారు. ఈ ప్రాసెస్‌ సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు.

ఎంపిక పూర్తయిన  తర్వాత ఈ సచివాలయాల పరిధిలోని పార్టీకి సంబంధించిన కన్వీనర్లు డోర్‌ టు డోర్‌ వెళ్లి  పార్టీనుంచి సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారు.

15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయాల పరిధిలో ఒక అవగాహన వస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే.. మరోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ తిరుగుతారు.

అన్ని సచివాలయాల పరిధిలోకూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. కన్వీనర్లు అన్నవారు స్థానికంగా నివసించిన వారై ఉండాలి.  కన్వీకనర్ల ఎంపిక తర్వాత తదనంతరం ప్రతి యాభై ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహసారథులు కూడా అదే క్లస్టర్లకు చెందినవారై ఉండాలి.

సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు. 

ఈ కార్యక్రమాలు ఎందుకంటే బూత్‌ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. నెట్‌వర్క్‌ బలంగా  ఉండడం వల్ల గెలవటం అన్నది చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కి 175 గెలవాలి. 

బటన్‌ నొక్కడమే కాదు, ఈనెట్‌వర్క్‌ మొత్తం చాలా బలంగా పనిచేయాలి. ఈ నెట్‌వర్క్‌  అంతా బలంగా పనిచేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా మీ అందరిమీదా ఉంది. డిసెంబర్‌20లోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడాలి.

మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఉండదు. కచ్చితంగా ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మీది.

గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా. దేవుడి దయ వల్ల వాతావరణం చాలా బాగుంది. మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.  ఇలాంటి మంచి వాతావరణంలో మనం అడుగులు ముందుకేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు తిరగడానికి భయపడతారు.

కాని మొదటిసారి.. నాన్న హయాంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్న వారికి ఎవ్వరికీ కూడా నిరాకరించకుండా పథకాలు అమలు చేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది. పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న బేధాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement