సాక్షి, అమరావతి : నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులనకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాల ఉండేలా మొత్తం రాష్ట్రంలో 30 కశాశాలల నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటు, తీసుకుంటున్న జాగ్రత్తలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. (‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’)
స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై సీఎం ఆరాతీశారు. కాలేజీల కోసం ఇప్పటివరకు దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించినట్లు సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ వివిధ రకాల కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధంచేశామని పేర్కొన్నారు. ఫినిషింగ్ స్కిల్‌కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 162కి పైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. (జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం)
పరిశ్రమల అవసరాలపై సర్వే చేసి దాని ప్రకారం కోర్సులను నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు తెలిపారు. పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామని, సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్ హాల్ లారెన్‌స్టెన్ (యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్), డిపార్ట్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నామని తెలిపారు. అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. ల్యాబ్ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామన్నారు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయన్నారు. (సుపరిపాలన వైఎస్ సంతకం)
అలాగే వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సూచించారు. హై ఎండ్‌స్కిల్స్‌తోపాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment