మన మహిళలు 'నవ'దుర్గలు  | CM YS Jagan Revolutionary decisions Towards women empowerment | Sakshi
Sakshi News home page

మన మహిళలు 'నవ'దుర్గలు 

Published Wed, Oct 5 2022 4:36 AM | Last Updated on Wed, Oct 5 2022 3:15 PM

CM YS Jagan Revolutionary decisions Towards women empowerment - Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో అన్నింటా అర్ధ భాగం కంటే అధికంగానే దక్కించుకున్న అతివలు ‘శైలపుత్రి’గా శక్తి సామర్థ్యాలు చాటుకుంటున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో ‘లలితాదేవి’గా  బాలికలు ప్రకాశిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంగ్లిష్‌ మీడియం చదువులతో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ ‘గాయత్రి’గా విరాజిల్లుతున్నారు. అమ్మ ఒడితో ‘చదువుల తల్లి’గా రాణిస్తున్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, గోరుముద్దతో ‘అన్నపూర్ణదేవి’ని తలపిస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ చేయూతతో ప్రతి మహిళ ‘మహాలక్ష్మి’గా అవతరిస్తోంది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, ఇళ్ల పట్టాలతో అక్క చెల్లెమ్మలు ‘దుర్గాదేవి’గా పురోగమిస్తున్నారు. దిశ, సచివాలయ పోలీస్‌ లాంటి అస్త్రాలతో ప్రతి మహిళా ‘మహిషాసురమర్దిని’గా ధైర్యంగా జీవిస్తోంది.

సాక్షి, అమరావతి: నవదుర్గ అవతారాలకు ప్రతి రూపాలుగా ప్రతి అతివ నవరత్నాలతో పురోగమిస్తోంది. సామాజిక, రాజకీయ రంగాల్లో శక్తి స్వరూపిణిగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర మహిళలు కీర్తి ప్రతిష్టలు సముపార్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో దశ తిరిగిన మహిళా లోకానికి ఇది నిజమైన విజయ దశమిగా అభివర్ణిస్తున్నారు. నవకాంతులు ప్రసాదించడంలో నవరత్నాల పథకాలు కీలకపాత్ర పోషించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మహిళా సాధికారతలో సాటిలేదు..
మహిళా సాధికారతలో ఏపీ సాధించిన అద్భుతాలను గమనిస్తే  దేశంలో మరే రాష్ట్రం మనకు సాటి లేదని చెప్పొచ్చు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలంటూ 1993 నుంచి పార్లమెంట్‌లో బిల్లులు పెడుతూనే ఉన్నా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తూ చట్టం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది.

నామినేటెడ్‌ పదవుల్లో 51 శాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం ఇదే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ ఛైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి చీఫ్‌ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గాను నీలం సాహ్ని నియమితులయ్యారు. గతంలో మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి వైఎస్సార్‌ రికార్డు సృష్టిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు అవకాశమిచ్చి చిత్తశుద్ధి చాటుకున్నారు.

తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి, మలి విడతలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వై‹స్‌ చైర్మన్‌ పదవుల్లో 15 మహిళలకే దక్కాయి.

12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్‌ పదవులకుగానూ 18 మంది మహిళలే ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళలకే అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల  వలంటీర్‌ ఉద్యోగాల్లో 53 శాతం, దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో 51 శాతం మహిళలకే ఇవ్వడం విశేషం. 

ఆసరాతో ఆదుకున్నారు...
చంద్రబాబు సర్కారు మోసాలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరాతో ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న బ్యాంకు రుణాలు మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం ఎన్నికలు జరిగిన తేదీ నాటికి 78.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్లు రుణాలు ఉండగా ఇప్పుటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం ఆయా మహిళల ఖాతాల్లో జమ చేసింది. 2020 సెప్టెంబరులో తొలి విడతలో రూ.6,318.76 కోట్లు, రెండో విడతగా 2021 అక్టోబరులో మరో రూ.6,439.52 కోట్లను మహిళలకు అందజేసింది. 

సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం.. 
గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు ఈ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది.

2014 తర్వాత విభజన అనంతరం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలు ఆగిపోయింది. పొదుపు సంఘాల మహిళలపై వడ్డీ భారం పడింది. దీనివల్ల సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటిదాకా బాగా నడుస్తూ ‘ఏ’ కేటగిరిలో ఉన్న సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి.

2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. గత మూడేళ్లలో ఈ పథకం ద్వారా మహిళా సంఘాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు రూ.3,615.29 కోట్ల వడ్డీని ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌కు తిరిగి చేరాయి. 

‘చేయూత’తో శాశ్వత జీవనోపాధికి శ్రీకారం
గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోని 45–60 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తారు. 26.39 లక్షల మంది మహిళలకు మూడు విడతల్లో రూ.14,110.61 కోట్లను ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించింది.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం చేకూర్చే లబ్ధితో మహిళలకు శాశ్వత జీవనోపాధులు కలిగేలా అమూల్, హిందూస్థాన్‌ యూనీలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్, రిలయెన్స్‌ రిటైల్, అజియో లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మల్టీ నేషనల్‌ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 5,28,662 కుటుంబాలు వివిధ వ్యాపారాలు, ఆదాయ మార్గాల ద్వారా శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి.

అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి
ప్రతి తల్లి తన బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తుంది. వాటిని నెరవేర్చేలా విద్యారంగ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు. చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే భరించేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు.

మూడేళ్ల వయసులో అంగన్‌వాడీల కేంద్రాలకు వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్‌ విద్య, ఉన్నత విద్య పూర్తి చేసేవరకు పేద పిల్లల చదువుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సంతృప్తస్థాయిలో వాటిని అమలు చేయడమే కాకుండా తల్లిదండ్రులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది.

జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు లాంటి పథకాలను రూ.వేల కోట్లతో అమలు చేస్తున్నారు. డిజిటల్‌ విద్య అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ఏటా ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యా రంగంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారు.

గతంలో ఉన్నత విద్యార్థులకు ఇచ్చే ట్యూషన్‌ ఫీజులు నామమాత్రంగా ఉండగా ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పాఠశాల, ఉన్నత విద్యపై రూ.55,064.13 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో పాఠశాల విద్యార్ధుల కోసం రూ.43,236.67 కోట్లు వ్యయం చేయగా ఉన్నత విద్యార్ధుల కోసం రూ.11,827.46 కోట్లు వెచ్చించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో 47,32,065 మంది విద్యార్ధులు చదువుతుండగా ఒక్కో విద్యార్థిపై రూ.91,369.56 చొప్పున ఖర్చు చేసింది. ఉన్నత విద్యారంగంలో 11,02,000 మంది విద్యార్ధులుండగా ఒక్కొక్కరిపై రూ.1,07,327 చొప్పున వ్యయం చేసింది. అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తుండగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు.

సంపూర్ణ పోషణ.. గోరుముద్ద
రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని సమకూర్చడంతోపాటు అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి బలవర్థక ఆహారం అందిస్తున్నారు. వారికి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తున్నారు.

ఏడు షెడ్యూల్‌ ప్రాంతాల్లో మంచి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు జరుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వం ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లను వెచ్చిస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో రకమైన మెనూతో బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. 

లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ
సొంతిల్లు సామాన్యుల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి అక్కచెల్లెమ్మ తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. మహిళా సాధికారతకు పెద్దపీట‡ వేసిన సీఎం జగన్‌ రాష్ట్రంలో లక్షల మంది మహిళల సొంతింటి కలను నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 31 లక్షలకుపైగా ఇళ్లను నిర్మిస్తున్నారు.

మహిళల పేరిట ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, పట్టణ, నగర ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల విలువైన స్థలాలను మహిళల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడంతో పాటు పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంది.

ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్తులను సమకూర్చడం పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సమకూరుస్తోంది.

అగ్రవర్ణ పేద మహిళలను ఆదుకున్న ప్రభుత్వం
వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. 45 – 60 ఏళ్ల వయసున్న దాదాపు 3.93 లక్షల మంది ఓసీ అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇది కాకుండా కాపు నేస్తం, లా నేస్తం లాంటి పథకాల ద్వారా కూడా అగ్రవర్ణ మహిళలకు ప్రభుత్వం మేలు చేస్తోంది. 

మహిళా భద్రతకు ‘దిశ’ దిక్సూచి
మహిళా భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర మహిళల చేతిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన బ్రహ్మాస్త్రం దిశ యాప్‌ ఉంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు నిముషాల్లోనే రక్షణ కల్పించే అన్నలా దిశ యాప్‌ భరోసానిస్తోంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చన్న విశ్వాసాన్నిస్తోంది.

దిశ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించడమే కాకుండా అందుకు అవసరమైన మౌలిక వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్‌ వాహనాలు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించింది. దిశ యాప్‌పై సీఎం జగన్‌ స్వయంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా పోలీసు శాఖ ఇతర శాఖలతో కలసి మహిళలను చైతన్యం చేస్తోంది.

ఇప్పటివరకు 1.35 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. దిశ యాప్‌ను ఆశ్రయించడం ద్వారా దాదాపు 12 వేల మంది మహిళలు రక్షణ పొందారు. మన రాష్ట్ర మహిళలు ఇతర రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్నా సరే దిశ యాప్‌ వారిని ఆదుకోవడం విశేషం. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ప్రమాదంలో చిక్కుకుని దిశ యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించగా, మన రాష్ట్ర పోలీసులు తక్షణమే స్పందించి ఢిల్లీ పోలీసుల ద్వారా భద్రత కల్పించి సురక్షితంగా స్వరాష్ట్రానికి తెచ్చారు.

మహిళలపై వేధింపులు, దాడుల కేసుల సత్వర దర్యాప్తు, న్యాయస్థానాల్లో విచారణకు కూడా దిశ వ్యవస్థ దోహదపడుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్‌ చేసి ఏడు రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయగా... 8 నెలల్లో న్యాయస్థానం విచారణ పూర్తిచేసి దోషికి ఉరిశిక్ష విధించేలా చేశారు.

దిశ యాప్‌ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్‌సీఆర్‌బీ) 2021  వెల్లడించింది. మహిళలకు భద్రత కల్పించడంతో సమర్థంగా పని చేస్తున్న దిశ యాప్‌ జాతీయ స్థాయిలో 19 అవార్డులు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement