
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన మార్పు విప్లవాత్మకమైనది. మొన్నటి ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమికి కారణాలు బలమైనవేమీ కావు. ప్రత్యర్థులు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించారు. బడుగు–బలహీన వర్గాల సంక్షేమాన్నీ, అభివృద్ధినీ ఓర్వలేని కూటమి నేతలు పనిగట్టుకొని విషప్రచారం చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలుగా చిత్రిచారు. సంక్షేమ పథకాలపై పెడుతున్న దృష్టి అభివృద్ధిపై లేదని ప్రచారం చేశారు. విదేశాల్లో స్థిరపడి అమరావతిలో భూములు కొన్న కార్పొరేట్స్‌తో డబ్బులు వెదజల్లించి అడ్డదారిలో, అసంబద్ధపు ప్రేలాపనలతో కూటమి అధికారంలోకి వచ్చింది.
అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో సంక్షేమాన్ని విస్మరిస్తే వెనకబడిన జాతులు సామాజికంగా, ఆర్థికంగా మరింత నష్టపోతాయి. సంక్షేమం, అభివృద్ధి వేరు వేరు కాదని రాజకీయ పార్టీలూ, నాయకులూ గుర్తించాలి. ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పేదల జీవితాలను సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచకుండా దేశం ముందుకు పోదు. అభివృద్ధి చెందిన వారితో ఈ పేద ప్రజలు పోటీ పడాలంటే వారికి విద్య అవసరం అని బలంగా నమ్మారు కాబట్టే జగన్ సంక్షేమానికి పెద్దపీట వేశారు.
జగన్ సామాజిక వర్గాల వారీగా ఇవ్వాల్సిన సీట్ల కంటే ఎక్కువ ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. కాగా చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న మంత్రి పదవులను ఒక్క దళితుడికి కూడా కేటాయించలేదు.
అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోను పక్కాగా అమలుపరుస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు ఒక పథకం కూడా అమలు కాకముందే అక్రమ కట్టడాల పేరుతో వైసీపీ పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లపైనా దాడులు చేస్తూ విధ్వంసక పాలన ప్రారంభించారు. ప్రజల పక్షాన నిలబడి వారి భవితకు బంగారు బాటలు వేస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే... పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఈ విజయాన్ని బాబు ప్రభుత్వం వాడుకోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిచేసి తాము గత పాలకుల కంటే ఎంత గొప్పవాళ్లమో నిరూపించుకోవాల్సిన కూటమి నేతలు... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
గత ఐదేళ్ళల్లో అనేక రంగాల్లో వచ్చిన మార్పులను చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ‘జగన్ అవసరం కాదు... అనివార్యం’ అనిపిస్తోంది. జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక తరం పిల్లలు గొప్ప విద్యవంతులుగా విద్యాలయాల నుంచి బయటకు వచ్చేవారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఈ తరహా అభివృద్ధి ముందుకు వెళుతుందా అన్నది సందేహమే.
– సునీల్ నీరడి, ఉస్మానియా యూనివర్సిటీ
పొలిటికల్ సైన్స్ రీసర్చ్ స్కాలర్
Comments
Please login to add a commentAdd a comment