రిబ్బన్ కట్ చేసి ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని నామకరణం చేస్తున్నాం. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆమోదంగా ఇటీవల జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారు. మీ కోసం మరింతగా పని చేస్తాం.రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుపతి, కడప, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్‌లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక నుంచి కర్నూలులోని ఓర్వకల్లులో కూడా విమానాశ్రయం ప్రారంభమవుతోంది. మనందరం నిర్మించుకోబోతున్న ‘న్యాయ రాజధాని’ నుంచి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కలిపే ఎయిర్‌పోర్టుగా ఇది నిలబడుతుందని గర్వంగా చెబుతున్నా.
కర్నూలు: ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని ప్రజల హర్షధ్వానాల మధ్య నామకరణం చేశారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి ఉదయం 11.45 గంటలకు ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని, జాతీయ జెండాను ఎగుర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి టెర్మిల్ బిల్డింగ్ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు (గురువారం) ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. కారణమేంటంటే కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండేవని, ఇక నుంచి విమానయానం ప్రారంభమవుతోందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. బెంగళూరు, వైజాగ్, చెన్నైలకు సర్వీసులు నడుస్తాయని, ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రూ. 110 కోట్లతో విమానాశ్రయం పనులు
- ఎన్నికలకు కేవలం నెలరోజుల గడువు ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టు పూర్తికాక మునుపే, అనుమతులు రాకుండానే, విమానాలు ఎగరకుండానే, చివరకు కనీసం రన్‌వే కూడా పూర్తి స్థాయిలో పూర్తవ్వకుండానే అప్పటి ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేశారు. ఆయన పేరు చంద్రబాబునాయుడు. ఇది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
- అప్పటి నుంచి ఈ రెండేళ్లలో విమానాశ్రయం కచ్చితంగా రావాలనే పట్టుదలతో రూ.110 కోట్లు విలువైన పనులను కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పోలీసు బ్యారెక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, బ్యారెక్, సబ్‌స్టేషన్లు, రన్‌వేలలో బ్యాలెన్సింగ్ పనులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లతో పాటు ఇతరత్రా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం.
- ఆస్ట్రియా నుంచి రెండు అధునాతన అగ్నిమాపక శకటాలు తెప్పించాం. కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), డీజీసీఏ అనుమతులు తెప్పించడం, విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు పూర్తి చేయడంలో సంబంధిత మంత్రితో పాటు అందరూ శ్రమపడ్డారు.
‘ఉయ్యాలవాడ’ పేరుపై చిరంజీవి కృతజ్ఞతలు
విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పేరు పెట్టడంపై ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశంలో తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషం’అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉయ్యాలవాడకు అసలైన నివాళి..
- మనదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో పుట్టింది. 1915లో గాంధీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటగా బిహార్‌లోని చంపారన్‌లో సత్యాగ్రహం జరిగింది.
- వీటి కంటే ముందు, స్వాతంత్య్రానికి వందేళ్లు ముందే.. తొలి స్వాతంత్య్ర పోరాటం అని చరిత్రకారులు చెప్పిన 1857లో సిపాయిల తిరుగుబాటుకంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచి వచ్చారు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
- ఈ కార్యక్రమానికి ముందు తపాలా శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయ పోస్టల్ స్టాంప్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో గ్రూపు ఫొటో దిగారు.
- ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment