పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు | Comprehensive arrangements for Tenth class exams | Sakshi
Sakshi News home page

పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

Published Mon, Apr 25 2022 4:13 AM | Last Updated on Mon, Apr 25 2022 7:50 AM

Comprehensive arrangements for Tenth class exams - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.  పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. 

ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, సిట్టింగ్‌ స్క్వాడ్లు
పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 292 సిట్టింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్‌ 18 నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్‌ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు. 

మే 22 వరకు మూల్యాంకనం
కాగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను మే 13 నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 22 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు సిద్ధం చేసింది. 

పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్‌ పరికరాలకు నో ఎంట్రీ
పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్‌ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్‌ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్‌ఆర్టీసీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్‌ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్‌ చర్యలు చేపడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement