ఊడిమూడిలంక వద్ద వంతెన నిర్మాణానికి మ్యాప్‌ను పరిశీలిస్తున్న పీఆర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి
పి.గన్నవరం: రాష్ట్రంలో రూ.3,300 కోట్ల వ్యయంతో 2,400 రహదారులను నిర్మిస్తున్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2,300 రహదారి పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక వద్ద వశిష్ట నదీ పాయపై నాలుగు లంక గ్రామాల ప్రజలకు అవసరమైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.49.5 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ఎస్‌ఈ ఎం.నాగరాజు, ఈఈ చంటిబాబు, డీఈఈ ఎ.రాంబాబుతో కలిసి ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో కొత్తగా రూ.1,150 కోట్లతో వంతెనలు, రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రూ.2,600 కోట్లతో 3,285 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునికీకరిస్తున్నామని వివరించారు. ఇంతవరకు 2,300 కి.మీ. మేర రహదారులకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటికి త్వరలో ఖరారవుతాయని తెలిపారు. అంతకుముందు ఆయన ఊడిమూడిలంకలో ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
ఈ సమస్యను ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లంక గ్రామాల ప్రజలు అప్పట్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వంతెన నిర్మాణానికి సాంకేతిక బిడ్ పరిశీలనలో ఉందని, అది కూడా పూర్తయితే పనులు ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment