పోషకాలు మెండుగా ఉండి చూడగానే నోరూరించే ఖర్జూరం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎడారి పంట అయిన ఈ ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం సాగుచేస్తున్నప్పటికీ మనం వినియోగించే ఖర్జూరంలో మెజారిటీ వాటా దిగుమతులే. దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి భారత్ ఖర్జూరం దిగుమతి చేసుకుంటుంది.
అయితే ఖర్జూరం పంటలో లాభ దాయకతను గుర్తించిన దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే దీని సాగుపై మక్కువ చూపిస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభమైన ఖర్జూరం సాగు ప్రస్తుతం బాపట్ల జిల్లాకు విస్తరించింది.
అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో సుమారు 6.8 ఎకరాల్లో రైతులు ఖర్జూరం పంట సాగు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన బర్హీరకం సాగుచేస్తున్నాడు.
దుబాయ్ నుంచి మొక్కలు తెచ్చి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలుచేసినట్లు చిరంజీవి చెప్పారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తేనే లాభం ఉంటుందని భావించి ఖర్జూరం సాగువైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. చిరంజీవి తోట తోట ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉంది.
అనుకూలమైన నేలలివే..
సారవంతమైన తువ్వ (తెల్ల) నేల, గరప, నల్ల నేల, బంక నేలలతోపాటు, పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకి అనుకూలంకాదు. ఖర్జూరం వేసవిలో కాపుకి వస్తుంది. ఉషో్టగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందికరం. దీనివల్ల మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది.
నాటిన మూడేళ్లకు కాపు
ఈత జాతికి చెందిన ఖర్జూరం మొక్క నాటిన మూడేళ్లకు కాపుకి వస్తుంది. ఇందులో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం. సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగుల ఎడంతో ఎకరాకు 78 మొక్కలు నాటుకోవచ్చు. మగ మొక్కలు తోటకు చుట్టూ అంచు వరుసలో నాటుతారు. మగ మొక్కలు కండెకు వచ్చిన తరువాత ఆ పుప్పొడిని భద్రపరుస్తారు.
ఖర్జూరం మొక్క డిసెంబర్‌లో పూతకు వస్తుంది. ఆడ మొక్కలు పూతకు రాగానే ఆ పూతపై మొగ మొక్కల నుంచి సేకరించిన పుప్పొడిని చల్లుతారు. పూసిన మూడు నుంచి నాలుగు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. ఐదు నెలలకు గెలలను కోసి విక్రయించుకోవచ్చు. ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది.
తొలి నాలుగేళ్లు దిగుబడి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం మొక్కలు నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతరపంటలుగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన వ్యాపారి బర్హీ రకం కాయలను కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతు చిరంజీవి చెప్పారు. ఈ రకం ఖర్జూరాన్ని ప్రాసెస్ చేయకుండానే తినవచ్చని తెలిపారు.
ఒక్కో మొక్క రూ.4,500
అద్దంకి ప్రాంతానికి బాగా అనుకూలమైన రకం బర్హీ. ఇందులో పసుపు, ఎరుపు రకాలు బాగా తియ్యగా ఉంటాయి. వీటిని తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దుబాయ్ నుంచి తెప్పిస్తాడు. నెల పాటు తన వద్ద మొక్కలను పెంచి ఒక్కో మొక్క రూ.4.500 చొప్పున విక్రయిస్తాడు. అదే విధంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు తెప్పించుకోవచ్చు. మొక్కల సంఖ్య, నాటే విధానం వివరాలు నర్సరీ నిర్వాహకులనుంచి తెలుసుకోవచ్చు.
అనంతపురం రైతును స్ఫూర్తిగా తీసుకున్నా..
సంప్రదాయ వ్యవసాయ సాగులో ఏటా నష్టాలు వస్తున్నాయి. ఖర్జూరం సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి దిగులు ఉండదు. అయితే ఖర్జూరం మొక్కలను మన దేశంలో టిష్యూ కల్చర్ చేయకపోవడంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో మొక్కల కొనుగోలుకు అధిక ఖర్చు అవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ పరిధిలో మొక్కలు ఇస్తే ఖర్జూరం సాగు మరింత పెరిగే అవకాశం ఉంది.
– చిరంజీవి, రైతు, తిమ్మాయిపాలెం
అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం
ఉషో్టగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. వేసవిలో వర్షాలు పడితే కాపు రాదు. బాపట్ల జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి, ఆడ మొక్కల పూతపై వేసే సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లు అవసరం. లేకపోతే రైతే ఆ పని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఖర్జూరం సాగులో మంచి లాభాలు వస్తాయి.
– దీప్తి, అద్దంకి డివిజన్, ఉద్యానశాఖ అధికారి, బాపట్ల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment