సాక్షి, నరసరావుపేట: భారత దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. ఇది బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అందించిన ఫలమని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలోని పార్క్ సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వివరించారు. 70 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గా చూసిన సీఎంలను గతంలో చూశామని, సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఈ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించి వృద్ధిలోకి తెస్తున్నారని అన్నారు.
చంద్రబాబు పాలనలో ఒక్క మైనార్టీకి మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తనను డిప్యూటీ సీఎంగా చేశారని, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఓ మైనార్టీ మహిళను మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా చేసిన ఘనత జగనన్నదేనని తెలిపారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు రూ.23,176 కోట్ల లబ్ధి కలిగించారని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎంకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదని, వెన్నెముక వంటి బ్యాక్‌బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ బీసీలను అక్కున చేర్చుకొని, అన్నింటా పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పూర్తి అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో చరిత్రలో మరే సీఎం చేయని విధంగా అధిక శాతం పదవులు ఇచ్చారన్నారు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. నందిగం సురేష్ వంటి పేదింటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిన ఘనత జగనన్నదేనని అన్నారు. బీసీలకు జడ్జి పోస్టులు వద్దని లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ పేదింటి పిల్లలను అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రాజధాని ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి గూడు కల్పించాలని జగనన్న కలలు కన్నారన్నారు. వీటన్నింటినీ ఓర్వలేని చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా ద్వితీయ శ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి ఉన్నతికి పాటు పడుతున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పారు.
చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకంగా 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కుల గణన చేస్తామని కాకమ్మ కథలు చెప్పాయని, సీఎం జగన్ దాన్ని ఆచరణలో పెడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సీఎం జగన్ పల్నాడుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, వరికపూడిసెలకు అనుమతులు సాధించారని, రూ.3 వేల కోట్లతో హైలు అభివృద్ధి చేయించారని, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తన్నారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామని చెప్పారు.
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సాయంత్రం 5 గంటలకు రెంటచింతల నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకష్ణదేవరాయలు, నందిగం సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రకు వేలాది ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మాచర్ల శివారు నుంచి పాదయాత్రగా పట్టణంలోని పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మాచర్ల నేతలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం భారీ జన సందోహం మధ్య సభ ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాల పేదలకు చేస్తున్న మేలును నేతలు వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్.., జగన్ రావాలి– జగనే కావాలి’ ‘వై నాట్ 175 ’ అంటూ నినదించారు.
నేడు సత్యసాయి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment