గన్నవరం: విమాన ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేసే డిజియాత్ర సేవలు శుక్రవారం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన డిజియాత్ర సేవలను ఉపయోగించుకుని ఇండిగో విమానంలో తిరుపతికి వెళ్లారు.
అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనివల్ల చెక్ ఇన్, బోర్డింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. గత నెల రోజులుగా దీనిని ప్రయో గాత్మకంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 9,500 మంది ప్రయాణికులు డిజియాత్ర అప్లికేషన్‌ను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇది కాగిత రహిత విధానమని.. ఫేషియల్ రికగ్నైజేషన్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఎయిర్‌పోర్ట్ జాయింట్ జీఎం సూర్యభగవానులు, టెర్మినల్ మేనేజర్ అంకిత్, ఎయిర్‌పోర్ట్ ఏసీపీ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment