ఉమామహేశ్వరరావు సతీమణి నిరోషాకు చెక్కును అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం అందజేశారు. లావేటి ఉమామహేశ్వరావు 2020, జూలై 18న కశ్మీర్‌లో టెర్రరిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తూ అవి పేలడంతో మృతి చెందారు. అప్పట్లోనే ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరామర్శించి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ లావేటి ఉమామహేశ్వరరావు సతీమణి నిరోషాకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, తూర్పు కాపు, కాళింగ, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, అంధవరపు సూరిబాబుల సమక్షంలో చెక్కును అందజేశారు.
పూర్తి న్యాయం జరిగింది
సీఎం జగన్ తనకు పూర్తి న్యాయం చేశారని వీర జవాన్ ఉమామహేశ్వరరావు భార్య నిరోషా అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 లక్షల చెక్కు అందుకున్న అనంతరం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ సహాయం అందించడంలో కాస్త జాప్యం జరిగినా ఊహించని స్థాయిలో మొత్తాన్ని ఇవ్వడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. భర్తను కోల్పోయిన తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగించడం కొంత కష్టంగా ఉండడంతో సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలిపానే తప్ప ప్రభుత్వంపైన గానీ, ప్రజాప్రతినిధులపైన గానీ ఆరోపణలు చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment