సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్య పెద్ద వ్యాపారంగా మారిపోయిందని సోమవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ‘డీసెట్’తో సంబంధం లేకుండా ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం ఏ మాత్రం సబబు కాదని తేల్చిచెప్పింది.
► స్పాట్ అడ్మిషన్ అంటేనే దొడ్డిదారిన ప్రవేశం కల్పించడమని, ఇందుకు ఏ చట్ట నిబంధనలు కూడా అంగీకరించవని స్పష్టం చేసింది.
► డీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని, అసలు పరీక్షే రాయని వారికి ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో ఎలా ప్రవేశాలు ఇస్తారని డీఈడీ కాలేజీ యాజమాన్యాలను నిలదీసింది.
► 2018–19, 2019–20లకు ప్రభుత్వం అనుమతినివ్వనప్పుడు విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించింది.
► 2017–18 విద్యా సంవత్సరానికి అనుమతినిచ్చి నాటి ప్రభుత్వం తప్పు చేస్తే, మళ్లీ మళ్లీ ప్రభుత్వాన్ని అదే తప్పు చేయమంటారా అని నిలదీసింది. ఆ తప్పు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించమంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు తాము ఎప్పుడూ ఇవ్వలేమంది.
► స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై కూడా సానుభూతి చూపలేమని తేల్చిచెప్పింది. అవసరమైతే వారి నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
► సింగిల్ జడ్జి వద్ద డీఈడీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌లను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
► 2018–19, 2019–20 సంవత్సరాలకు తమ కాలేజీల్లో ప్రవేశాలను ప్రభుత్వం ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ డీఈడీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలను సింగిల్ జడ్జి జస్టిస్ రజనీ తోసిపుచ్చారు. దీనిపై డీఈడీ కాలేజీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
► ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ విద్యార్థుల నుంచి ఈ డీఈడీ కాలేజీలు లక్షల రూపాయలు దోచేశాయన్నారు.
దేశంలో విద్య వ్యాపారమైపోయింది
Published Tue, Sep 29 2020 4:34 AM | Last Updated on Tue, Sep 29 2020 4:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment