సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రుల ఎంపానల్మెంట్ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి పాదర్శకంగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ముడుపులు అందితేనే ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అంటూ ఈనాడులో సోమవారం ప్రచురించిన కథనంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.
ఎంపానల్మెంట్ అవడానికి నిర్దేశించిన సదుపాయాలున్న ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పోర్టల్ అందుబాటులో ఉండే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తుల్ని నిర్ణీత సమయపాలనతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంపానల్మెంట్ ప్రక్రియలో మాన్యువల్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఏవైనా లోపాలుంటే ఆ వివరణలతో ఆన్లైన్లోనే ఆస్పత్రులకు నోటీసులు వెళతాయని తెలిపారు. ఇక రోగులకు వైద్యసేవల కోసం ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్), క్లెయిమ్‌లు ఆన్లైన్లో వివిధ స్థాయిల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులను, వైద్యసేవలకు సంబంధించి ప్రజలను ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే నేరుగా 104 (ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల నంబరు), 14400 (అవినీతి నిరోధక విభాగం) నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆస్పత్రుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల యాజమాన్యాలు సమస్యలను cgro@aarogyasri.ap.gov.in కు మెయిల్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment