
సాక్షి, అమరావతి: పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలింసిటీ కోట కట్టుకున్న ఈనాడు రామోజీ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా నీతులు వల్లించడం విస్మయం కలిగిస్తోంది! ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎస్సీలకు సమున్నత స్థానంతోపాటు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా ‘మీరెలా దళిత బంధువు జగన్?’ అని బరితెగింపు కథనాలను రామోజీ నిస్సిగ్గుగా ప్రచురించారు.
దేశమంతా ప్రశంసిస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను పొరుగు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అడిగే ధైర్యం రామోజీకి ఉందా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అని టీడీపీ పెద్దలు దురహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే రామోజీ కలం కదల్లేదు ఎందుకు? దళితులు శుభ్రంగా ఉండరని, వారికి చదువు రాదని, అయినాసరే సూపరింటెండెంట్లు అయిపోతారంటూ నాటి మంత్రి ఒకరు తమ పెత్తందారీతనాన్ని బయటపెట్టుకుంటే రామోజీ ఎక్కడ నక్కారు? రాజకీయాలు మీకెందుకురా? అంటూ దళితులనుద్దేశించి నాటి టీడీపీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు రామోజీ మరచిపోయినా ప్రజలు మరువరు.
రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేయడం నిజం కాదా? వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది నిజంకాదా? ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో పారదర్శకతకు పాతరేసి అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టిన ఘనత గత ప్రభుత్వానిది కాదా? ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేయడంతో పేదలపైన దళితులపై పెనుభారం పడలేదా? ఉన్నత చదువులు, వైద్యానికి పేదలు దూరం కాలేదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకానికి తూట్లు పొడవటంతో దళిత బిడ్డల చదువులు అర్థాంతరంగా నిలిచిపోలేదా? దళితులకు కనీసం ఒక్క ఇంటి పట్టా అయినా గత ప్రభుత్వం పంపిణీ చేసిందా?
నాలుగేళ్లలో అంతకు మించి..
పొరుగు రాష్ట్రంలో రూ.10 లక్షల చొప్పున దళిత బంధు పధకం కింద సాయం అందిస్తున్నట్లు ఒక పోలిక తెచ్చే ప్రయత్నాన్ని ఈనాడు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యతలను అనుసరించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ వృత్తుల్లో వున్న ఎస్సీ కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీతో అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు ఎస్సీల కోసం రూ.24,677.63 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.38,445.35 కోట్లను డీబీటీ ద్వారా 1,31,05,372 మంది దళితులకు నేరుగా పారదర్శకంగా అందించింది.
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ బీమా, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక పరోక్ష నగదు బదిలీ ద్వారా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక, ఇళ్ల స్థలాల పంపిణీ, తదితర పధకాలతో ఇప్పటివరకు 68,62,813 మంది లబ్ధిదారులకు మరో రూ.21,475 కోట్ల మేర సాయం అందింది.
ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాల ద్వారా దళిత కుటుంబాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలిస్తే అందులో 6,36,732 మంది దళిత వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలే ఉన్నారు. దీనిద్వారా ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక వారి కోసం 4,18,646 ఇళ్ల నిర్మాణాల రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. చరిత్రలో ఈ స్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలబడలేదు.
లోపాలను సరిదిద్ది విదేశీ విద్యా పథకం
విదేశీ విద్యా పథకం రద్దైందని, బెస్ట్ అవైలబుల్ పథకం లేదని, పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాలు లేవంటూ ఈనాడు అవాస్తవాలను కుమ్మరించింది. విదేశీ విద్యా పథకంలో లోపాలు, అక్రమాలను నివారించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తూ పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తున్నారు.
అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో క్యూఎస్ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్‌ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులకు గరిష్టంగా రూ 1.25 కోట్లు/ట్యూషన్ ఫీజు100 శాతం చెల్లించేలా పథకాన్ని గొప్పగా మార్చి అమలు చేస్తున్నారు. మిగిలిన వర్గాలకు రూ.కోటి గానీ ట్యూషన్ ఫీజు గానీ (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు.
ఈ స్థాయిలో విదేశీ విద్యకు గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను గత ప్రభుత్వంలో అమలు చేశారు. ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.
స్టడీ సర్కిళ్లపై తప్పుడు ప్రచారం
పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిల్‌లున్నాయి. తిరుపతి స్టడీ సర్కిల్‌లో బ్యాంక్ పీఓ పరీక్షల కోచింగ్ కార్యక్రమాన్ని నూతన భవనంలో ప్రారంభించారు. సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ ప్రోగ్రామ్ విశాఖపట్నం బ్రాంచ్‌లో ప్రారంభించారు. గ్రూప్ 1 సేవల కోచింగ్ విజయవాడలో ప్రారంభమైంది. మరి రామోజీ వీటిని తెలుసుకుంటున్నారా?
♦ గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పంపగా ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికయ్యారు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిల్‌లోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు.
♦ రాష్ట్రంలో 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు నిర్వీర్యం అయ్యాయంటూ ఈనాడు చేసిన మరో ఆరోపణ అవాస్తవం. షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు స్థిరమైన జీవనోపాధి కోçÜం ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఎస్సీలకు ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం అందించింది.
♦ గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు 30 శాతం నిధులు వినియోగించినట్టు ఈనాడు బాకా ఊదుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంతకు మించి ఖర్చు చేసిందన్నది వాస్తవం. 2019–20 నుంచి 2022–23 వరకు ఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్‌లో క్యాపిటల్ కింద రూ.3,440.15 కోట్లను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, మైనర్ ఇరిగేషన్, పురపాలక, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖలు ఖర్చు చేశాయి.
♦ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక భూ సంస్కరణలతో పెద్దసంఖ్యలో ఎస్సీలు లబ్ధి పొందారు. అసైన్డ్ భూముల మీద 33.29 లక్షల ఎకరాల భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇది ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది.
ఎస్సీ కాంపోనెంట్‌లో టాప్
ఎస్సీ కాంపొనెంట్ అమల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఖర్చే అధికంగా ఉంది. ఎస్సీ కాంపొనెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 12.41 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటైతే మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలు ఇవి. షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్‌కు గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.33,625.49 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.59,936.48 కోట్లు వెచ్చించింది.