సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయల ఉత్పాదకత ఏటా పెరుగుతూనే ఉన్నా పెత్తందారులు మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు! ‘కూరగాయల్లోనూ కుంగి పోయాం’ అంటూ కాకి లెక్కలు కడుతున్నారు! రాష్ట్రంలో ఉద్యాన పంటల దిగుబడుల్లో 20.9 శాతం వృద్ధి రేటు సాధించగా కూరగాయల దిగుబడుల్లో 12.88 శాతం నమోదైంది. కూరగాయల దిగుబడులను పరిశీలిస్తే 2014–15లో 42.61 లక్షల టన్నులు ఉండగా ప్రస్తుతం 79.06 లక్షల టన్నులకు పెరిగింది. అంటే పదేళ్లలో 88.09 శాతం పెరిగింది.
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు దిగుబడులు 63.61 లక్షల టన్నులు ఉండగా గత నాలుగున్నరేళ్లలో 74 లక్షల టన్నులుగా ఉంది. టీడీపీ హయాంలో సగటు ఉత్పాదకత 7.48 శాతం ఉంటే ప్రస్తుతం 12.88 శాతంగా ఉంది. దిగుబడులు పెరిగాయో తగ్గాయో చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. కంటి చూపు మందగించిన పెత్తందారులకు ఇవేమీ కానరాక కూరగాయల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ నేలచూపులు చూస్తోందంటూ అబద్ధాలు అచ్చేశారు.
ఎగుమతులు కనిపించవా?
పంట ఉత్పత్తులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సీజన్‌లో వస్తాయి. మన రాష్ట్రంలో పంట సాగు దశలో ఉన్న సమయంలో నాసిక్ నుంచి ఉల్లి తెచ్చుకుంటాం. మన దగ్గర ఉత్పత్తి ప్రారంభం కాగానే మన ఉల్లిని మహారాష్ట్రకు పంపుతుంటాం. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే టమాటాలో ఏటా మూడొంతులు పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంది. వంగ, బీర, సొర, దొండ, బెండ లాంటి కూరగాయలు సైతం పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు ప్రముఖ నగరాలకు నిత్యం సరఫరా అవుతాయి. పట్టణీకరణ వల్ల కొంత విస్తీర్ణం తగ్గినా దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
నాడు పంటల బీమా రక్షణ ఏది?
సీఎం జగన్ వివిధ పథకాల కింద కూరగాయలు సాగు చేసే 1.42 లక్షల మందికి రూ.140.58 కోట్ల సబ్సిడీని అందించారు. నాలుగున్నరేళ్లలో హెక్టార్‌కు రూ.80 వేల సబ్సిడీతో 6.75 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు బిందు, తుంపర పరికరాలు అమర్చారు. వాటిలో కూరగాయలు సాగయ్యే విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పైనే ఉంది. టీడీపీ హయాంలో కూరగాయల పంటలకు బీమా రక్షణే లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నోటిఫై చేసిన కూరగాయల పంటలకు సైతం ఉచిత పంటల బీమాను వర్తింప చేస్తోంది. నాలుగున్నరేళ్లలో 10,87,608 హెక్టార్లలో సాగైన పంటలకు సంబంధించి 5,35,554 మంది రైతులకు రూ.1,409.57 కోట్ల పంటల బీమా పరిహారాన్ని జమ చేసింది.
నేడు మిన్నగా పంట నష్టపరిహారం
టీడీపీ సర్కారు ఐదేళ్లలో 3.34 లక్షల మంది రైతులకు రూ.387.33 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వగా సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో 3.84 లక్షల మంది రైతులకు రూ.449.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించారు. ఈ ఏడాది 17,992 మంది ఉద్యాన రైతులకు రూ.19.56 కోట్ల కరువు సాయం విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఉద్యాన పంటల విస్తరణ పథకాల కింద షేడ్ నెట్స్, పాలీహౌస్‌లకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీలను అందించారు.
రాయితీలు.. ప్రోత్సాహకాలు
సాగులో మెళకువలు, చీడపీడల నియంత్రణ, కొత్త సాంకేతిక పద్ధతులు ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న తోటబడుల ఫలితంగా నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. తీగ జాతి కూరగాయలను పెంచేందుకు శాశ్వత పందిళ్లు, టమోటా నాణ్యత పెంచేందుకు ట్రెల్లీస్ పద్దతిలో నాటటాన్ని ప్రోత్సహిస్తున్నారు. కూరగాయల సాగుకు షేడ్ నెట్ హౌస్, పాలీ హౌస్, ప్లాస్టిక్ మల్చింగుకు ప్రభుత్వం సబ్సిడీతో ప్రోత్సహిస్తోంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగా తెచ్చిన గ్రాప్టింగ్ విధానంలో ఉత్పత్తి చేస్తున్న టమాటా, వంగ, బీర, సొర మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఏటా 15–20 లక్షల గ్రాఫ్టెడ్ మొక్కల పంపిణీ ఫలితంగా దిగుబడులు 3–4 రెట్లు వస్తున్నాయి. టీడీపీ హయాంలో హెక్టార్‌కు 15–20 టన్నులకు మించి రాని టమాటాలు ప్రస్తుతం 35–40 టన్నుల దిగుబడులు వస్తున్నాయి. గతేడాది వర్షాలకు నీరు నిలిచినా తట్టుకొని మంచి దిగుబడులొచ్చాయి. గతంలో 10 టన్నులకు మించని వంగ ప్రస్తుతం 25 టన్నులు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment