సాక్షి, అమరావతి: ఎన్నికలు వద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, తమకు వ్యాక్సిన్ ఇచ్చాక జరపాలని కోరామని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని, కరోనాకు బలి చేయవద్దని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏమిటని ఎస్‌ఈసీ ప్రశ్నించారని, ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రాకముందు ఎన్నికలు జరిపారని, ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికలు పెడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల విధులు వద్దన్న ఉద్యోగుల్ని వదిలేసి, చేస్తామని ముందుకొచ్చిన వారితో ఎన్నికలు నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తామని, అందులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు.
మాకు రక్షణ ఎవరు కల్పిస్తారు: బొప్పరాజు
ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చి, పీపీఈ కిట్లు ఇచ్చి ఎన్నికల్లో పనిచేయిస్తామని ఎస్‌ఈసీ చెప్పారని, అవి ఏమయ్యాయని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ నెల రోజులు ఉంటుందని, ఇప్పటివరకూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించలేదని, కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు జరుగుతున్నాయని, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయలేదని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి అంశాలు చాలా ఉన్నాయని ఇవేమీ పట్టించుకోకుండా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడేందుకు ఎన్నికల కమిషనర్‌ను అపాయింట్‌మెంట్ అడిగినా మూడురోజులుగా ఇవ్వలేదన్నారు.
మా ప్రాణాలకు బాధ్యత వహిస్తారా..?: చంద్రశేఖర్‌రెడ్డి
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, అదే సమయంలో ఎన్నికల విధుల్లో కరోనా వల్ల తమకు ప్రాణహాని జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా అని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల్లో పనిచేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంఘం జిల్లాలు, మండలాల యూనిట్ల నుంచి ఎన్నికలు బహిష్కరించాలని తీవ్ర ఒత్తిడి వస్తోందని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ తమ ప్రాణాలు పోగొట్టుకునేలా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేరని, అవసరమైతే సమ్మెకు వెళ్లాలని కిందిస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమవుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment