కుప్పం(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీజీఈఎఫ్ ఆధ్వర్యాన ఆదివారం కుప్పం పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.
నాలుగేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన 42 సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన 10 హామీల్లో 8 అమలు చేశారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3 వేల కోట్లు అదనపు భారం పడుతుందని తెలిసినా, ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి కారి్మకుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. కరోనా సమయంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, మన దగ్గర నెలనెలా జీతాలు అందజేశారని తెలిపారు. గతంలో ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం రోడ్లపై ధర్నాలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 1.30లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసిన ఘనత ’ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న 3,790 మంది వీఆర్వోలకు, పంచాయతీరాజ్‌లో 1,500 మందికి పదోన్నతులు కల్పించారని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. పదేళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారికి త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రాకపోవడానికి సీఎం కారణం కాదని, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులే కారణమని ఆయన స్పష్టంచేశారు.
ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు
ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో ఉద్యోగులను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపి నిరసన తెలపాలని, ధర్నాలు చేయాలని ప్రోత్సహిస్తున్నాయని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. అవసరమొచ్చినప్పుడు రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నేత చల్లా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment