AP: స్మార్ట్‌ మీటర్లపై ఇంధన శాఖకు అభ్యంతరం లేదు | The Energy Department Of AP Has No Objection To Smart Meters | Sakshi
Sakshi News home page

AP: స్మార్ట్‌ మీటర్లపై ఇంధన శాఖకు అభ్యంతరం లేదు

Published Tue, Jan 3 2023 7:47 AM | Last Updated on Tue, Jan 3 2023 8:17 AM

The Energy Department Of AP Has No Objection To Smart Meters - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు అభ్యంతరం లేదని, నిజానికి తామే ముందుండి ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పష్టంచేశారు. కొన్ని నెలల క్రితం ఆర్థిక శాఖ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని తాను డిస్కంలకు అంతర్గతంగా రాసిన లేఖలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, ఆ లేఖలు పూర్తిగా చదివితే వాస్తవాలు బోధపడతాయని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని కేంద్రం నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు మొదలైందని చెప్పారు.

రాష్ట్రంలో తొలి దశలో 18.57 లక్షల వ్యవసాయ, 27.54 లక్షల వ్యవసాయేతర (నెలకు 200 యూనిట్లుపైన విద్యుత్‌ వినియోగం ఉన్నవి) సర్వీసులకు ఈ మీటర్లు అమర్చనున్నట్లు తెలిపారు. వ్యవసాయేతర సర్వీసుల్లో 4.72 లక్షలు మాత్రమే గృహ సర్వీసులని, అవి కూడా అమృత్‌ నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో 13.54 లక్షల సర్వీసులకు అమర్చాలని అనుకుంటున్నప్పటికీ, వాటికి ఇంతవరకు టెండర్లు పిలవలేదన్నారు. తొలి దశ ఫలితాలను బట్టి మిగతా వారికి మీటర్లు అందిస్తామన్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడల్లా విద్యుత్‌ మీటర్లను మారుస్తున్నామని, దానికి వినియోగదారుల నుంచి చార్జీలు తీసుకోవడం కూడా సర్వసాధారణంగా జరిగేదేనని తెలిపారు.

కానీ ఇప్పుడే కొత్తగా స్మార్ట్‌ మీటర్ల భారం వినియోగదారుల మీద వేస్తున్నట్లు, మీటర్లతో బిల్లులు పెరుగుతాయంటూ అసత్య ప్రచారం చేయడం తగదని, ప్రజలపై ఆర్థిక భారం పడదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ, గృహ విద్యుత్‌ సర్వీసులు కలిపి ఉన్న ఫీడర్లు, ఓవర్‌లోడ్‌ అయిన ట్రా న్స్‌ఫార్మర్లలో తొలి విడతగా 9 వేలను తొమ్మిది నెలల్లో మార్చి, ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. దీనివ్ల నష్టాలు తగ్గుతాయన్నారు. ఈ పనులకు, స్మార్ట్‌ మీటర్లకు కలిపి రూ.13,252 కోట్లు ఖర్చవుతుందని, అందులో మీటర్లకు 22 శాతం, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనులకు 60 శాతం.. మొత్తం రూ.5,484 కోట్లను కేంద్రం గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు.  పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వల్లే  ప్రమాదాలు జరు గుతున్నాయన్నారు. ఇకపై విద్యుత్‌ ప్రమాదాలు జరగకూడదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు

కేంద్రం రూపొందించిన బిడ్‌ డాక్యుమెంట్‌తోనే టెండర్లు
కేంద్రం రూపొందించిన ‘స్టాండర్డ్‌ టెండర్‌ బిడ్‌ డాక్యుమెంట్‌’నే స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో అనుసరిస్తున్నామని విజయానంద్‌ చెప్పారు. దానిలో ఒక్క అక్షరం మార్చేందుకు తమకు అధికారం లేదన్నారు. టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు కూడా పంపించాకే టెండర్లు పిలిచామన్నారు. ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా టెండర్‌ నిబంధనలు మార్చడం అసాధ్యమని గుర్తించాలన్నారు. బహిరంగ పోటీ ద్వారా అన్ని అర్హతలు ఉన్న సంస్థకే టెండర్లు ఇస్తామని, ఎలాంటి అపోహలకూ తావు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఐ. పృధ్వితేజ్, బి.మల్లారెడ్డి, సెంట్రల్‌ డిస్కం సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement