YS Vivekananda Reddy Murder Case: నాడు సంబంధం లేదని నేడు కుటుంబంపై నిందలా?  - Sakshi
Sakshi News home page

నాడు సంబంధం లేదని నేడు కుటుంబంపై నిందలా? 

Published Wed, Mar 2 2022 3:43 AM | Last Updated on Wed, Mar 2 2022 11:10 AM

Everyone in Shock with YS Sunitha behavior in YS Viveka Assassination - Sakshi

మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు.. 
‘‘మా నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకే సంబంధం ఉండి ఉంటే పోలీసులు ఇప్పటికే బయటపెట్టేవారు. హంతకులను పట్టుకోకుండా సిట్‌ అధికారులు ఏదో దాస్తున్నారు. విచారణ సరిగా జరగడం లేదు. వీళ్లే చేశారంటూ కొన్ని రోజుల తరువాత మా కుటుంబ సభ్యులనే నిందితులుగా చూపించే అవకాశం కూడా ఉంది. ఆ భయంతోనే చెబుతున్నా. మా కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఆదినారాయణరెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేముంటే మాపైనే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కుట్రతో, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారన్న భయం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఉంటే ఆ అనుమానం వచ్చేది కాదు. సిట్‌ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం లేదు. రాజకీయంగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు.’’
– 2019 మార్చి 26న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ప్రకటన

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, పరమేశ్వరరెడ్డిలే తన తండ్రిని హత్య చేయించి ఉండవచ్చని గతంలో గట్టిగా ఆరోపించిన వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ ఒక్కసారిగా మాట మార్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2020 ఆగస్టులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో గతంలో చెప్పినదానికి పూర్తి భిన్నంగా సందేహాలు వ్యక్తం చేశారు. పూర్తి అవాస్తవాలు, ఊహాజనిత అంశాల ఆధారంగా ఆమె ఆరోపణలు చేయడం విస్మయపరుస్తోంది. కడప ఎంపీ టికెట్‌ వైఎస్‌ షర్మిలకుగానీ వైఎస్‌ విజయమ్మకుగానీ ఇవ్వాలని వివేకా భావించినట్టు ఆమె సీబీఐకి చెప్పారు. అయితే అదే అంశాన్ని గతంలో సిట్‌ దర్యాప్తు సందర్భంగా ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. 

రాజకీయ ప్రయోజనాలే కారణమా?
కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యవహరించారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీలో పూర్తి ఏకాభిప్రాయం ఉంది. అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ పని చేశారని 2019 ఎన్నికల ముందు సునీతమ్మ వెల్లడించడం గమనార్హం. దానికి విరుద్ధంగా ప్రస్తుతం సీబీఐకి చెప్పడం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివేకా హత్యలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సునీత సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.

వివేకా హత్య జరిగినప్పుడుగానీ అనంతరం సిట్‌ దర్యాప్తు సందర్భంగాగానీ ఆమె ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి, పరమేశ్వరరెడ్డిలపైనే సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుండటం వెనుక రాజకీయ ప్రయోజనాలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇక సునీత భర్త రాజశేఖరరెడ్డి గతంలో ఎన్నడూ వైఎస్సార్‌ కుటుంబ సభ్యులపైగానీ వైఎస్సార్‌సీపీ నేతలపైగానీ సందేహాలు వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం వైఎస్‌ కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం వెనుక ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు దాగున్నాయన్నది స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement