బ్యాలెట్ పేపర్‌తోనే స్వచ్ఛమైన ప్రజా తీర్పు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : 2029లో బ్యాలెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోటీ చేసినా ఫలితం ఉండదని, 2024లో మోసం చేసినట్టుగానే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్‌లే శాసనం చేశాయని కౌంటింగ్ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి’ అంటూ రాష్ట్ర ప్రజలంతా అయోమయంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటికీ వైఎస్సార్‌సీపీ అధిష్టానంగానీ, అభ్యర్థులుగానీ ఫలితాలపై నోరు మెదపలేదన్నారు.
దీనిపై ఎందరు అనుమానం వ్యక్త చేసినా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉలుకూ పలుకూ లేదన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక వి«ధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment