
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జే. శాంత మంగళవారం వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కాగా అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే శాంత వాల్మీకి సామాజికి వర్గానికి చెందినవారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ శాంతమ్మ మాట్లాడుతూ.. జగన్ పాలనలోనే వాల్మీకిలకు ప్రాధాన్యం లభించిందన్నారు. వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇక నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్సార్‌సీపీలో పని చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ తాను తోడుంటానని.. అందరం కలిసి జగన్‌కు అండగా ఉందామన్నారు.
జగన్ చేస్తున్న మంచి పనులు దేశమంతటా తెలుసన్నారు జే శాంత. ఒక ఇంటికి పెద్దకొడుకు ఎలా బాధ్యతగా ఉంటారో సీఎం జగన్ అలా పని చేస్తున్నారని తెలిపారు. ఏపీ రాష్ట్రం జగన్ పాలనకు దాసోహం అంటోందని.. అలాంటి పార్టీలో తాను కూడా ఒక సైనికురాలిగా పని చేస్తానని చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేయటానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని, వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రమే వాల్మీకిలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు.
చదవండి: అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్