‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.
ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే.
ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం
ధర ఘనం
ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్‌లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్‌లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది.
రావులపాలెం కేంద్రంగా..
ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది.
ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్‌లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్‌లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు.
పోషకాలు అధికం
ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది.
సాగులో ప్రతికూలతలు
ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ.
తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం
రావులపాలెం మార్కెట్ యార్డ్‌కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్‌పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం
పెట్టుబడి అధికం
ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం
ఆరోగ్యానికి ఎంతో మేలు
ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment