సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు, వక్రీకరణలు, అవాస్తవాల విషపు రాతలతో ‘ఈనాడు’ మళ్లీ రెచ్చిపోయింది. ‘ఏడాదిలోపు 3% పనులే’ అంటూ రాసిన ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం.. ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్.. గత ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక లోపం వలన పోలవరం ప్రాజెక్టుకు కలిగిన సరిదిద్దలేని నష్టాలు, వారి అవినీతి, స్వార్థ ప్రయోజనాలు, తప్పిదాలతో ప్రాజెక్టుపై పడిన 2 వేల కోట్ల రూపాయల అదనపు భారం, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పిన సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వం హెడ్ వర్క్స్, ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో అవినీతి చర్యలకు పాల్పడింది. 2013 నుంచి 2016 వరకు పనులు నత్తనడకన నడిచాయి. ఈ లోగా ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థ తమకు రేట్లు గిట్టుబాటు కావడంలేదని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపాదించగా, ఆ ప్రభుత్వం చేతికి ఎముకలేదనట్లుగా వారు అడిగిందే తడవుగా 2015-16 రేట్లకు ఆమోదం తెలుపుతూ అగ్రిమెంట్ విలువని రూ.4054 కోట్ల నుండి రూ.5386 కోట్లకు పెంచింది. ఈసీపీ నిబంధనలకు విరుద్ధంగా 2015-16 రేట్లకు పెంచి రూ.1332 కోట్ల అనుచిత లబ్ధిని వారికి చేకూర్చుతూ 29.09.2016 న ఉత్తర్వులు జారీ చేసింది.
2015-16 రేట్లు ఇచ్చినా, పనులు నత్తనడకన కొనసాగడంతో అప్పటి ప్రభుత్వం మిగిలిన పనులు చేయడానికి 2015-16 రేట్లతో టెండర్ పిలిచారు. ఈలోగా ఏమి జరిగిందో తెలియని రహస్యం.. కానీ టెండర్ రద్దు చేసి 3 దఫాలుగా మిగిలిన పనులను నామినేషన్ పద్దతిలో నవయుగ కంపెనీకి అప్పగించారు.
1. 27.02.2018 తేదీన రూ. 1244.36 కోట్లు
2. 28.05.2018 తేదీన రూ. 921.87 కోట్లు
3. 11.01.2019 తేదీన రూ. 751.55 కోట్లు
మొత్తం రూ. 2917.78 కోట్లు
నామినేషన్ పద్ధతిలో నవయుగకి పెంచిన రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 3000 కోట్ల రూపాయల పనిని ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. పై రెండు కంపెనీలు కూడా అస్మదీయులవే. నవయుగ అధికంగా లాభం ఉండే మాస్ కాంక్రీట్ పనులను మాత్రం (స్పీల్ ఛానెల్ కాంక్రీట్, స్పీల్ వే పౌండేషన్ వంటివి) దాదాపు రూ. 1675 కోట్ల పని చేశారు. క్రిటికల్ కాంపొనెంట్లు అయిన రెండు కాఫర్ డ్యామ్ పనులు మాత్రం నత్తనడకన జరిగాయి.
ఈలోగా బావరు సంస్థ డీ-వాల్ పూర్తి చేసింది.. కానీ నవయుగ సంస్థ కాఫర్ డ్యామ్‌ను మాత్రం కట్టలేదు. u/s కాఫర్ డ్యామ్ మధ్యలో వదిలేశారు. తరువాత వచ్చిన వరదలకు ఏం జరిగిందో తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో ఎడమ కాలువ ప్యాకేజీ-5లో మిగిలిన పనిని అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కంపెనీ అయిన పీఎస్‌కే కంపెనీకి రూ.71 కోట్ల విలువ చేసే పనులను రూ.182 కోట్లకు నామినేషన్ పద్దతిలో అప్పగించారు .
పోలవరం డ్యామ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు
గత ప్రభుత్వ అవినీతి, అనాలోచిత విధానాల వలన ప్రధాన డ్యామ్ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు, డీ వాల్ దెబ్బ తినడం, ఈ పాపం టీడీపీదే అనేది జగమెరిగిన సత్యం. ఇది ఖండించలేని వాస్తవం. మరొక ప్రధాన కారణం.. ప్రాజెక్టును సరియైన రీతిలో ఆర్ధిక వనరులు అందక పోవడం.. ఈ పాపం కూడా గత ప్రభుత్వానిదే. 2017-18 రేట్లకు అంచనాల ఆమోదం విషయంవలో 2016లో అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది.
గత ప్రభుత్వ హయాంలో 2017 కేంద్ర క్యాబినెట్ నోట్‌లో పోలవరానికి నిధులను మూడు సంవత్సరాల కిందటి 2013-14 ధరల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్‌కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆర్థిక, జల శక్తి శాఖలు ప్రతిపాదించినప్పుడు అప్పటి ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందా? దాని వలనే కదా 20,398.61 కోట్లు ఇస్తే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారమే కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కూడా రాష్ట విభజనకు ముందు పెట్టిన ఖర్చు 4730.71 కోట్లను మినహాయించి 15,667.90 కోట్లు మాత్రమే వారు ఇస్తున్నారు.
ఈ రాబోయే నేటి విపత్తును ముఖ్యమంత్రి.. ఆనాడు ప్రతి పక్ష నేత హోదాలో అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం జరిగిన తప్పిదాన్ని అప్పుడే అడిగి ఉంటే సరి చేసి ఉండటం జరిగేది అని కూడా వాఖ్యానించారు. ఇప్పుడు పై విషయాలన్ని సీఎం జగన్ అభ్యర్దన మేరకు ప్రధాని చొరవతో ఆర్ధిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కొంత పురోగతి కూడా సాధించాం.
సీఎం జగన్ ఎన్నో సార్లు ప్రధాని, ఇతర ముఖ్యులను కలిసి ఒత్తిడి తేవడం వలన, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా డీపీఆర్‌లో వున్న క్వాంటిటీలకు అదనంగా చేసిన కొత్త నిర్మాణాలకు సంబంధించి పెట్టిన ఖర్చులో రూ. 826.18 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఎంతో పోరాటం చేసి ఈ నిధులు 2015-16 ధరల ప్రకారం (రెండు సంవత్సరముల తరువాతి ధరలతో) ఈ ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. ఈ దిశగా ఇది తొలి విజయం మాత్రమే. 2017-18 ధరలతో అన్నీ కాంపొనెంటులకూ రీయింబర్స్ మెంటు నిధులు పొందే దానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రణాళికా ఫలితం:
ఈనాడు పత్రిక హెడ్ వర్క్స్‌లో సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన ఏ పనిని ఈ ప్రభుత్వం చేపట్టలేదో బాధ్యతతో చెప్పాలి. ఈ ప్రభుత్వం సీడబ్ల్యూసీ వారిచే డిజైన్ ఆమోదించబడిన ప్రతి పనిని పూర్తి చేసింది. కానీ గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే డిజైన్‌లు సిడబ్ల్యూసి చాలా ముందుగానే ఇచ్చినా వారు కట్టలేక, ఎంత నష్టం వాటిల్లిందో తెలిసిందే.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అత్యంత ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేసి కొన్ని కీలకమైన పనుల్ని ఇప్పటికే పూర్తి చేసింది. స్పిల్ వేను పూర్తి చేయడంతో పాటు దానికి 48 గేట్లు పెట్టింది. గత ఏడాది గోదావరి చరిత్రలో రెండో అతి పెద్ద వరద వచ్చినా సరే, సమర్థవంతంగా వరదను నియంత్రించగలిగింది.
స్పిల్ వే పైన అప్రోచ్ ఛానెల్‌ను, దిగువన వున్న స్పిల్ చానెల్‌ను, పైలట్ చానెల్‌ను దాదాపుగా పూర్తి చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ లో 2 గ్యాప్‌లను పూర్తి చేసింది. ప్రధాన డ్యామ్ లోని గ్యాప్ 3 కాంక్రీటు పనులను పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది.
ఇటీవల వచ్చిన అనూహ్య వరదల కారణంగా ఎగువ కాఫర్ డ్యామ్ దెబ్బ తినకుండా అప్పటికప్పుడు మంత్రితో సహా అధికారులు అందరూ డామ్ సైటులోనే ఉండి ముఖ్యమంత్రితో అనుక్షణం సంప్రదిస్తూ ఒక మీటరు ఎత్తు కూడా పెంచి ఎటువంటి నష్టం జరగకుండా నివారించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రళిణాకా బద్ధంగా ప్రభుత్వం పూర్తి చేసింది.
2. పునరావాసం :
పునరావాసం గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి గాని, వారి పత్రికలకు గాని లేనే లేదు అనే విషయాన్ని ఈ గణాంకాలు తేట తెల్లం చేస్తాయి. పునరావాసానికి మొత్తం అంచనా : 21,374 కోట్లు
పునరావాస పనులు +41.15 కాంటురు వరకు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 2023 లోగా మిగిలిన 9269 పీడీఎఫ్‌ఎస్‌ని కూడా పునరావాసం పూర్తి అవుతుంది. దీనికి దాదాపుగా 525 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది.
పునరావాసంలో వైఫల్యం అని గగ్గోలు పెడుతున్నారే? అసలు వైఫల్యం ఎవరిది. ఐదు సంవత్సరాలలో 484 కోట్లు ఖర్చు పెట్టి 3110 మందికి పునరావాసం కల్పించిన టీడీపీ ప్రభుత్వానిదా, లేక మూడు సంవత్సరాలలో 1677 కోట్లు ఖర్చు పెట్టి 8567 మందికి పునరావాసం కల్పించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదా వైఫల్యం?.. టీడీపీ ప్రభుత్వం పునరావాసం కనీస స్థాయిలో కూడా చేపట్టపోవడంలో ఒకే ఒక కారణం కనిపిస్తోంది.
కాలువల పనులు జరగడంలేదంటూ ఆరోపణలు..
ఇక్కడ కొంచెం వివరంగా గత ప్రభుత్వ వైఫల్యం చెప్పుకోవాలి. కుడి కాలువ సామర్ధ్యం మొదటగా 330 క్యూమేక్స్‌గా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. దివంగత మహానేత వైఎస్సార్ మొదటిగా చేసిన పని ఏమిటంటే, భవిష్యత్తు అవసరాలు మరియు కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ ఇవన్నీ ముందుగానే యోచన చేసి, కాలువ సామర్థ్యాన్ని 499 క్యూమేక్స్ కు పెంచుతూ G.O.Rt No. 765 Dt:- 07-10-2004 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 230 క్యూమేక్స్ నుండి 497 క్యూమేక్స్‌కు అదే జీవో ద్వారా పెంచారు. ముఖ్యంగా విశాఖపట్నం తాగునీరు, పారిశ్రామిక, వెనుకబడిన ఉత్తరాంధ్ర అవసరాలకై ప్రతిపాదిత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దృష్టి లో పెట్టుకుని వైఎస్సార్ కాలువ సామర్ధ్యాన్ని పెంచారు.
2014 ముందే రెండు కాలువల సామర్ధ్యాలు 499/497 క్యూసెక్కులకు పెంచి పనులు కొనసాగించినా, 2017వ సంవత్సరంలో రెండోపెట్టుబడి అనుమతికి ప్రతిపాదనలు 2010 2011 ధరలతో 16,010 కోట్లకు పొందటం ఒక వైఫల్యం అయితే, కాలువల సామర్ధ్యాలను 2005 డీపీఆర్ ప్రకారం పాత సామర్ధ్యాలకు మాత్రమే అంచనాలు వేయడం గత ప్రభుత్వం ఘోర వైఫల్యంగా పేర్కొనవచ్చు.
దీని వలన ఇప్పటికి కూడా కాలువల మీద 499/497 క్యూమేక్స్‌లకు పెట్టిన ఖర్చును 2005 డీపీఆర్ సామర్ధ్యానికి మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ చెల్లించడం వలన ప్రాజెక్టు ఆర్ధిక వనరుల కూర్పు దెబ్బతిని, నిధుల లభ్యత సమస్యగా మారింది
ఈ లోగా ప్యాకేజీలలో పని చేసే చాలా ఏజన్సీలు గత ప్రభుత్వ ప్రణాళిక వైఫల్యం, సహకార లోపం వలన దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ రేట్లకు చేయడానికి అంతగా ఆసక్తి ఎవరూ చూపడం లేదు. పైగా కాలువ పనుల మీద జరిగిన ఖర్చును పీపీఏ రియింబర్స్‌మెంట్ చేయడం లేదు. దీనికి కూడా ప్రధాన కారణం గత ప్రభుత్వం వారి నిర్వాకం వలనే. 2017 లో కేంద్ర క్యాబినెట్ 2013-14 రేట్లతో ఇరిగేషన్ కాంపొనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పినా, వారు నోరు మెదప కుండా ఉండటం ప్రధాన కారణం.
చదవండి: తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
మిగిలి పోయిన ఎడమ కాలువ పనులు ఏవిధంగా పూర్తి చేయాలి అన్న దాని మీద ఆర్ధిక, జలవనరుల శాఖలు కూలంకుషంగా చర్చిస్తున్నాయి. తొందరలోనే ఒక నిర్ణయం దీని మీద తీసుకుంటారు. ముందుగా హెడ్ వర్క్స పూర్తి చేయడం మీదనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దీనికి ఒక రెండు సంవత్సరాలు సమయం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పడుతుంది మిగిలిన ఎల్‌ఎంసీ పనులు 6 నుండి 12 నెలలోపు పూర్తి చేయవచ్చు అనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. ఈలోగా 2017-18 ధరల తో ప్రొజెక్టు అంచనాలను ఆమోదం పొందితే, కేంద్ర నిధుల లభ్యత అందుబాటు లోనికి వస్తుంది. హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయ్యే లోపుగానే, మిగిలిన కాలువ పనులు పూర్తి చేయగలం
4. ఈ ప్రభుత్వ ధృడ సంకల్పం :
ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా PPA/CWC/DDRPలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, జరిగిన తప్పిదాలను సరిచేసే ప్రణాళికను PPA/CWC/DDRPని ఒప్పించి ఆమోదింప చేసింది. ఇది ప్రాజెక్టు పురోగతిలో ఒక కీలక పరిణామం.
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ఈ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పూర్తి చేసింది. రెండి డ్యామ్‌ల మధ్య ఇప్పుడు వరద నీరు చేరదు కాబట్టి , వరదల సమయంలో కూడా ప్రాజెక్టు పనులు అనగా అగాధాలు పూడ్చటం, డయాఫ్రమ్ గోడలు దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రమ్ గోడలు నిర్మించి మెయిన్ డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానించడం వంటి పనులు నిరాటంకంగా చేసుకునే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
ఇప్పుడు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. తాత్కాలిక అవరోధాలు తొలగి ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్తితులు ఏర్పడినవి. అన్ని నిర్మాణాలు చురుకుగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్, మంత్రులు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వ పెద్దలు, వారి అస్మదీయుల జేబులోకి అవినీతి వరద ఎలా ప్రవహించినదో అలాగే ప్రాజెక్టును, దాని ఫలితాలతో కలిగే ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టిన విషయాలను అన్ని సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రిక జీర్ణించుకోలేక, ఓర్వలేక ఇంకోసారి విషం చిమ్మి, బురద చల్లే విధంగా ఈ కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment