సాక్షి, అమరావతి: ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతున్నా చూడలేకపోతోంది ఈనాడు. ముఖ్యంగా రైతులకు మేలు చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతోంది ఆ పచ్చ పత్రిక. అందులోను ఆక్వా రంగానికి విద్యుత్ ఎంత ప్రధానమో తెలిసి కూడా ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా చేస్తున్న మేలుకు తప్పుడు రాతల ద్వారా అడ్డుపడుతోంది.
అందులో భాగంగానే ‘విద్యుత్ ఇంజనీర్లే విస్తుపోయేలా’ అంటూ కనీస అవగాహన లేకుండా ఓ అబద్ధపు వార్తను శుక్రవారం వండి వార్చింది. గతంలో ధరలకు ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం ఉందని, లేబర్ చార్జీలు మెటీరియల్ చార్జీలకంటే ఎక్కువ చూపించారని, ఏపీఈఆర్‌సీ అనుమతి కూడా తీసుకోలేదని చేతికొచ్చిన అసత్యాలు అచ్చేసింది. ఈ కుట్రపూరిత కథనాన్ని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కథనంలో తప్పుల్ని ఆ సంస్థ సీఎండీ కె.సంతోష్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వాస్తవాలు ఇలా ఉన్నాయి.
► పశ్చిమగోదావరి జిల్లా 220/33 కేవీ అకివీడు సబ్‌స్టేషన్ నుంచి కృష్ణాజిల్లా 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కి అనుసంధానం చేస్తూ విద్యుత్ లైన్లు వేయాలని గతంలోనే ఏపీసీపీడీసీఎల్ ప్రతిపాదించింది. ఈ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 976 ఆక్వారంగ సంబంధిత పరిశ్రమలున్నాయి.
ఇవి నెలకు 30 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఈ సర్విసులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించడానికి ఈ అనుసంధానం తప్పదని డిస్కం భావించింది. ఈ ఇంటర్ లింకింగ్ లైన్ గతంలో ప్రతిపాదించినప్పటికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి విద్యుత్ సరఫరాకి కావలసిన అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అనుమతులు రావడంతో పనుల్లో కదలిక వచ్చింది.
► 132/33 కేవీ చిగురుకోట సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 33 కేవీ పోతుమర్రు ఫీడర్‌పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కు ఫీడ్ చేస్తున్నారు. ఇదే ఫీడర్‌పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్, 33/11 కేవీ మూలలంక సబ్‌స్టేషన్ కూడా అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఈ ఫీడర్ 20 మెగావాట్ల కంటే ఎక్కువ లోడును నమోదు చేస్తోంది.
వేసవి కాలంలో అధిక లోడ్ కారణంగా లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) విధించాల్సి వస్తోంది. అదీకాకుండా ఈ రెండు సబ్‌స్టేషన్లు ప్రధానంగా ఆక్వాకు విద్యుత్‌ను అందిస్తున్నాయి. 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌పై 950కి పైగానే ఆక్వా సర్విసులున్నాయి. ఈ రెండు సబ్‌స్టేషన్లకు 33 కేవీ ప్రత్యామ్నాయ సరఫరా లేదు. అలాగే 132/33 కేవీ చిగురుకోటపై లోడ్ గరిష్టంగా 124 మెగావాట్లుగా నమోదైంది. ఈ ప్రాంతంలో లోడ్ పెరుగుదల సంవత్సరానికి 25 నుంచి 30 శాతంగా ఉంది. అందువల్ల 220/33 కేవీ ఆకివీడు నుంచి కొత్త లైను ఏర్పాటు చేయడం అనివార్యమైంది.
► రెండేళ్ల కిందట ఈ ఇంటర్ లింకింగ్ లైన్ సిమెంట్ పోల్స్‌తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పడు మిచాంగ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు, సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వలన 33 కేవీ లైన్లు ఎం+ రూపంలో ఉండే మెటల్ టవర్స్‌ను ప్రతిపాదించారు. వీటివల్ల చెట్లు విరిగినా లైన్లకు ఎటువంటి సమస్య కలగదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. ఈ టవర్స్ చాలాకాలం మన్నికగా ఉంటాయి. ఉప్పుటేరు కెనాల్‌ను పరిగణలోకి తీసుకుని అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు.
► సిమెంట్ పోల్స్‌కి సంబంధించి లేబర్ ప్రతిపాదనలు వేరుగా, ప్రతి ఎం+ టవర్‌కి సంబంధించి లేబర్ కాస్ట్, టవర్స్ మెటీరియల్ కాస్ట్ కలిపి ప్రతిపాదించడం వలన ఈ రెండు ప్రతిపాదనల మధ్య అంచనాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు లేటెస్ట్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) డేటా ప్రకారం తయారుచేసి టెండర్ పిలవడం జరిగింది. సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ (ఎస్‌ఏపీ)లో ప్రతిపాదనలు చేయడం వల్ల లేబర్ కాస్ట్‌కి సంబంధించి ఎటువంటి దాపరికాలకు ఆస్కారం లేదు.
► యథార్థాలు తెలుసుకోకుండా ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించడం సరైన పద్ధతి కాదు. ఈనాడు వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆక్వా రంగానికి నిరంతరాయ విద్యుత్ చాలా ముఖ్యం. ఏమాత్రం కోతలున్నా.. ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతాయి. ఆక్వా రైతులకు భారీనష్టం వాటిల్లుతుంది. అలాంటి పరిస్థితి వారికి రాకుండా చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టుపై ప్రజలు, రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిన ఈనాడు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి.
Comments
Please login to add a commentAdd a comment