సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు తీపికబురు. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18–21 మధ్య రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 19 నుంచి చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని వెల్లడించారు.
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. కాగా రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాల్సిన తరుణంలో మరింతగా సెగలు కక్కుతున్నాయి.
సాధారణం కంటే 6 నుంచి 10 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇలా మూడు వారాలుగా తీవ్ర వడగాడ్పులు వీయని రోజు లేదు. ఏరోజుకారోజే ఉష్ణతాపం తగ్గుతుంది.. ఇక వాతావరణం చల్లబడుతుంది అని ఆశించిన వారికి ఆశాభంగమే అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అవి మరింత తీవ్రరూపం దాల్చి ఏకంగా 47 డిగ్రీలకు చేరువగా రికార్డయ్యాయి.
ఈ వేసవి సీజనులో తొలిసారిగా కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8, తునిలో 46.4 (ఇది సాధారణంకంటే 10.5 డిగ్రీలు అధికం) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా తూర్పు గోదావరి, ప్రకాశం, విజయనగరం, తిరుపతి, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో 45–46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపాయి. శుక్రవారం రాష్ట్రంలో 370 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 132 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
నేడు 264 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులు సెగలు కొనసాగనున్నాయి. శనివారం బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లోని 264 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 42 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 203 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భవన నిర్మాణ కారి్మకులు, ట్రక్ డ్రైవర్లు, రైతులు, వ్యవసాయ కూలీలు వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
వాయవ్య గాలుల వల్లే..
కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంతలా అట్టుడికిపోవడానికి వాయవ్య గాలులే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి రాజస్థాన్ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీస్తున్నాయని, అవి దిశ మార్చుకుని నైరుతి లేదా దక్షిణ గాలులు వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆరు రోజుల క్రితం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి, శ్రీహరికోటలకు చేరుకుని అక్కడే తటస్థంగా ఉండిపోయాయి. దీంతో రుతుపవనాల విస్తరణ జరగక రాష్ట్రంలో వర్షాలు కురవలేదు.. ఉష్ణోగ్రతలూ తగ్గుముఖం పట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment