
రైతులు తమ పంటను కాపాడుకునేందుకు వింత వింత ఆలోచనలతో సరి కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో రైతులు అధికంగా టమాటను సాగు చేస్తారు. తంబళ్లపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మల్‌రెడ్డి తనకున్న అర ఎకరా పొలంలో టమాట సాగు చేపట్టారు.
పంట తొలి దశలోనే చూసేందుకు పచ్చగా, ఏపుగా పెరగడంతో ఇతరుల దిష్టి తగిలి ఎక్కడ చేతికందకుండా పోతుందోనన్న భయంతో పొలం చుట్టూ సినీ హీరోయిన్లు తమన్నా, రాశీఖన్నా తదితర యువ హీరోయిన్ల పోస్టర్లను ఫ్లెక్సీల రూపంలో నాలుగువైపులా ఏర్పాటుచేశారు. అలాగే కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన లీలమ్మ అర ఎకరా టమట, అర ఎకరా బంతిపూలను సాగు చేస్తున్నారు.
ఈమె కూడా మల్‌రెడ్డి బాటలోనే పంటకు దిష్టి తగకుండా హీరోయిన్ల పోస్టర్లు పెట్టింది. రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు, ద్విచక్రవాహనదారులు వీటిని వింతగా చూస్తూ ఎవరి వెర్రి వారికి ఆనందం అంటూ నవ్వుకుని వెళుతున్నారు.