కర్నూలు(సెంట్రల్): విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆదివారం కర్నూలు నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ముందుగా కర్నూలు నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక ఇండిగో సంస్థకు చెందిన విమానం(6ఈ7911) బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం 09.05కి బయల్దేరి 10.10కి కర్నూలుకు చేరుకుంటుంది. కర్నూలు నుంచి 6ఈ7912 అనే నంబర్ కలిగిన విమానం ఉదయం 10.30కి బయల్దేరి మధ్యాహ్నం 12.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే 6ఈ7913 అనే నంబర్ కలిగిన మరో విమానం విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి కర్నూలుకు 2.55కి చేరుకుంటుంది.
6ఈ7914 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి మధ్యాహ్నం 3.15కి బయల్దేరి సాయంత్రం 4.25కి బెంగళూరు చేరుకుంటుంది. 6ఈ7915 అనే నంబర్ కలిగిన విమానం చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి కర్నూలుకు 4.10కి, 6ఈ7916 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి సాయంత్రం 4.30కి బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది. కాగా, ప్రయాణికుల నుంచి కూడా స్పందన బాగుంది. బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చేందుకు 52 మంది, కర్నూలు నుంచి విశాఖ వెళ్లేందుకు 66 మంది, విశాఖ నుంచి కర్నూలుకు 31 మంది, కర్నూలు నుంచి బెంగళూరుకు 63 మంది, చెన్నై నుంచి కర్నూలుకు 16 మంది, కర్నూలు నుంచి చెన్నైకి 32 మంది బుక్ చేసుకున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 వరకు విమాన ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న వారి వివరాలను ఇండిగో ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అలాగే విమాన టికెట్ల ధరలు ప్రస్తుతం కర్నూలు–బెంగళూరు మధ్య రూ.2,077, చెన్నైకి రూ.2,555, విశాఖకు రూ.3,077గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment