‘పచ్చ’ముఠా దోపిడీపై మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫైర్
ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత ఇసుక విధానం దుర్వినియోగమవుతోందని.. పేదలకు దక్కాల్సిన ఇసుకను కూటమి నేతలు దోచుకుపోతున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు మొద్దునిద్ర నటిస్తున్నారంటూ విమర్శించారు.
జొన్నాడ ఇసుక ర్యాంపులో రోజురోజుకూ పెరిగిపోతున్న ఇసుక అక్రమాలపై వివిధ దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వరుస కథనాలు వెలువడటంపై జగ్గిరెడ్డి స్పందించి ఆదివారం జొన్నాడలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఆయన సోదరుడు, జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకున్నారని ఆరోపించారు.
ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.300 వసూలుచేయాల్సి ఉండగా కూటమి నేతలు రూ.600 వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక ర్యాంపుల నుంచి కూటమి నేతల ద్వారా ప్రతినెలా మామూళ్ల కింద సుమారు రూ.రెండుకోట్ల వరకూ ఎమ్మెల్యే బండారుకు అందుతున్నాయని ఆరోపించారు. అలాగే, కూటమి నేతలు రాత్రి వేళల్లో లారీల్లో నింపి బయటకు తరలించి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామమాత్రపు ధరకు ఇసుకను సరఫరా చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఇసుక గుట్టలు సీజ్ చేయాలి..
ఇక కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సత్వరమే సీజ్ చేయాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మైన్స్ అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారే తప్ప ఇసుక దొంగలను గుర్తించడంలేదన్నారు.
ఇసుక గుట్టలను సీజ్‌చేసి అక్రమ తవ్వకాలను నియంత్రించకుంటే అధికారులను దోషులుగా గుర్తించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఏటిగట్టు పక్కన నిల్వ ఉంచిన ఇసుక గుట్టల పైనుంచి జగ్గిరెడ్డి సెల్ఫీ దిగి.. దమ్ముంటే ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు చాలెంజ్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment