త్వరలో 123 పట్టణాలు, నగరాల్లోని ప్రజలపై కొత్త పన్ను
సర్వీసు చార్జీలుగానో,మరో రూపంలోనో వసూలు చేయాలని మౌఖిక ఆదేశాలు
ఇప్పటివరకు ఉన్న బకాయిలు సైతం ప్రజల నుంచే వసూలు
సాక్షి, అమరావతి: చెత్త పన్ను రద్దుపై చంద్రబాబు సర్కారుది కపట నాటకమని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం పట్టణాల్లోని ప్రజలపై చెత్త పన్ను వేసిందని, ఆ పన్నును రద్దు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే పన్నును మరో రూపంలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. పైగా, గత ప్రభుత్వం చెత్త సేకరణ వాహనాలు సమకూర్చిన 40 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే చెత్త పన్ను వసూలు చేయగా, ఇప్పుడ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 123 పట్టణాలు, కార్పొరేషన్లలో వసూలుకు రంగం సిద్ధం చేసింది.
ఈమేరకు అన్ని పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. చెత్త పన్ను అని చెప్పకుండా, సరీ్వస్ ఛార్జీల రూపంలోనో, మరో రూపంలోనో ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు రూ. 32 కోట్ల పాత బకాయిలు కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
నాడు స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా..
మున్సిపాలిటీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలకు, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరించినందుకు స్థానిక సంస్థలు సేవా రుసుం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ 2021 అక్టోబర్ 2న నాటి ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి ఇంటికీ 3 చెత్త డబ్బాలు అందించి, వాటిలో వేసిన చెత్తను సేకరించేవారు.
ఇందుకోసం 40 మున్సిపాలిటీల్లో 4 వేల చెత్త సేకరణ వాహనాలను సమకూర్చింది. ఇంటి నుంచి చెత్త సేకరణ, వాహనాల నిర్వహణకు అవి తిరిగే వార్డుల్లో నెలకు ఇంటికి రూ.30, వాణిజ్య సముదాయాలకు రూ.150 చొప్పున సేవా రుసుముగా నిర్ణయించారు.
రద్దు చేసినట్లే చేసి.. కొత్త పన్నా?
కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను బలవంతంగా విధిస్తోందని, ఎవరూ చెల్లించొద్దని పదేపదే చెప్పారు. అంతేగాక తాము అధికారంలోకి వచ్చాక ఆ పన్నును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు బయటకు ప్రకటించారు. కానీ, చెత్త సేకరించినందుకు కొంత మొత్తాన్ని మున్సిపాలిటీలే సర్వీస్ చార్జీలు వసూలు చేసుకోవాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పురపాలక శాఖలోని ముఖ్యులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
అంతేగాక చెత్త సేకరణ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు, వాహనాలకు 2023 సెప్టెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.32 కోట్లను మున్సిపాలిటీలే చెల్లించాలని, ఆ సొమ్మును కూడా ప్రజల నుంచే తీసుకోవాలని చెప్పడం గమనార్హం. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించినందున, ఆ పేరుతో కాకుండా మరో రూపంలో వసూలు చేయాలని మున్సిపాలిటీలను ఆదేశించినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం మున్సిపాలిటీలకు చెల్లిస్తున్న ఏదో ఒక పన్నులో ఈ మొత్తాన్ని కలిపి వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment